India vs Australia First Semi-Final Match in ICC Champions Trophy, 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫస్ట్ సెమీ ఫైనల్‌లో నేడే భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు హైబ్రిడ్ విధానంతో భారత్ తన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడుతోంది. అయితే వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ ఏ లో టాప్‌లో నిలిచిన భారత్.. ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. వన్డే ప్రపంచక ప్ 2023 ఫైనల్ అనంతరం వన్డే ఫార్మాట్‌లో భారత్, ఆస్ట్రేలియా తొలిసారి తలపడుతు న్నాయి. దీంతో ఈ మ్యాచ్ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ లోనూ గెలిచి వన్డే ప్రపంచకప్ 2023 ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది.
మరోవైపు గ్రూప్ బీలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన ఆసీస్.. వర్షం సాయంతో సెమీ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించిన ఆసీస్.. అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. దీంతో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఆసీస్.. సెమీ ఫైనల్‌లో భారత్‌ను ఢీ కొంటుంది. మరోవైపు ఆ జట్టుకు సీనియర్ ఆటగాళ్లు ప్యాట్ కమిన్స్, హజెల్ వుడ్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినీస్ అందుబాటులో లేరు. కానీ యువ ఆటగాళ్లతో ఆ టీమ్ పటిష్టంగానే ఉంది. అంచనాలు లేకుండా బరిలోకి దిగి టీమిండియాకు షాకి ఇవ్వాలనే పట్టుదలతో ఉంది.
భారత్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విషయానికొస్తే పటిష్టంగా ఉంది. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న దుబాయ్ వికెట్‌పై నలుగురు స్పిన్నర్లతో ప్రత్యర్థులకు ఇబ్బంది పెట్టేలా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. భారత్ టాప్ 4 బ్యాటర్లలో ఇద్దరు రాణించినా.. ఆసీస్‌ను భారత్ ఓడించే అవకాశం ఉంది. సెమీస్ పోరుకు భారత్ ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. నలుగురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతోనే ఆడనుంది.
అయితే న్యూజిలాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ షమీకి గాయమైంది. బ్యాటింగ్ సమయంలో పరుగు తీస్తుండగా.. మిచెల్ సాంట్నర్ వేసిన బాల్ అతని భుజానికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన షమీ 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఫిట్‌గా లేకుంటే అతని స్థానంలో హర్షిత్ రానా లేదా అర్ష్ దీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది. బ్యాటింగ్, స్పిన్ విభాగంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. న్యూజిలాండ్ మ్యాచ్ ఐదు వికెట్ల ఘనతను అందుకున్న మిస్టరీ స్పి న్నర్ వరుణ్ చక్రవర్తీని కొనసాగించనున్నారు. ఎక్స్ పేసర్ కావాలనుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్‌పై వేటు పడనుంది. బ్యాటింగ్ విభాగంలో రోహిత్, గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. కోహ్లి, అయ్యర్, రాహుల్, అక్షర్ పటేల్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. జడేజా, హార్దిక్ పాండ్యా ఫినిషర్ రోల్ పోషించనున్నారు.
భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ/ హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.