Site icon Prime9

India vs New Zealand: విజృంభించిన కివీస్ బౌలర్లు.. 46 పరుగులకే కుప్పకూలిన భారత్

India all out 46 against New Zealand: బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తొలుత 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ(2) పరుగుల వద్ద సౌథీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లి, సర్పరాజ్ ఖాన్ డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు డబుల్ డిజిట్ పరుగులు కొట్టగా.. మొత్తం ఐదుగురు ఆటగాళ్లు డకౌట్ కావడం గమనార్హం.

భారత్ 10 పరుగులకే కీలక వికెట్లు కోల్పోగా.. యశస్వి జైస్వాల్(17) ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ కివీస్ బౌలర్ల ధాటికి భారత్ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్‌లు కూడ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. చివరిలో రిషబ్ పంత్(20) పరుగులు చేశాడు.

దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ 31.2 ఓవర్లలో 46 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్నీ 5 వికెట్లు పడగొట్టగా.. విలియం ఓ రూర్కే నాలుగు వికెట్లు, సౌథీ ఒక్క వికెట్ తీశాడు. అయితే 92 ఏళ్ల చరిత్రలో భారత్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. అంతకుముందు 1987లో వెస్టిండీస్ జట్టుపై 75 పరుగులు చేసింది.

Exit mobile version