Netherlands won with 3rd Super Over against Nepal: టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ మ్యాచ్ మూడో సూపర్ ఓవర్‌లో డిసైడ్ అయ్యింది. ట్రై సిరీస్‌లో భాగంగా నెదర్లాండ్స్, నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. టీ20ల్లో ఓ మ్యాచ్ మూడో సూపర్ ఓవరులో నిర్ణయం తేలడం ఇదే తొలిసారి. మూడో సూపర్ ఓవర్‌లో మైఖేల్ లెవిట్ భారీ సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.
మొదట నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేసి, 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నేపాల్ చివరి ఓవరులో 16 పరుగులు చేయాల్సి ఉంది. టెయిలెండర్ నందన్ యాదవ్ ఆఖరి రెండు బంతుల్లో బౌండరీలు కొట్టాడు. దీంతో స్కోర్ సమం అయ్యింది. మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్‌కు వెళ్లింది.
తొలి సూపర్ ఓవర్‌లో నేపాల్ 19 రన్స్ చేసింది. దీంతో కుసాల్ భుర్తల్ 18 పరుగులు చేశాడు. డచ్ ఓపెనర్ ఓదౌద్ ఐదో, ఆరో బంతిని భారీ షాట్లుగా మలిచాడు. ఐదో బంతిని సిక్సర్, ఆరో బంతికి ఫోర్ కొట్టి, స్కోర్లను సమం చేశాడు. రెండో సూపర్ ఓవర్‌లో నెదర్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. దాంట్లో 17 పరుగులు చేసింది. ఆ ఓవర్ కూడా రసవత్తరంగా సాగింది. కైల్ క్లెయిన్ వేసిన ఆఖరి బంతిని దీపేంద్ర సింగ్ సిక్సర్ కొట్టాడు. దీంతో ఆ ఓవర్ కూడా డ్రాగా ముగిసింది. దీంతో మూడోసారి షూట్ఔట్ ఓవర్‌కు వెళ్లారు.
డచ్ ఆఫ్ స్పిన్నర్ జాచ్ లయన్ కాచెట్ తన ఓవర్‌లో తొలి నాలుగు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. నేపాల్ ఓవర్‌లో పరుగులు చేయలేకపోయింది. సింగిల్ అవసరం కాగా, ఫస్ట్ బంతికే లెవిట్ భారీ షాట్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. టీ20 ట్రై సిరీస్ టోర్నీలో స్కాట్‌లాండ్ మూడో జట్టుగా పోటీపడుతున్నది.