Baroda make history, smash the highest ever total in T20 cricket: టీ20 పొట్టి క్రికెట్‌లో మరో సంచలనం జరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరల్డ్ రికార్డు నమోదైంది. ఇండోర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో బరోడా జట్టు పరుగుల విధ్వంసం చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 349 పరుగులు చేసింది. దీంతో టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
బరోడా జట్టులో భాను పూనియా ఊచకోత కోశాడు. 51 బంతుల్లో 134 పరుగులు రాబట్టి పరుగుల వరద సృష్టించాడు. ఇందులో మొత్తం 15 సిక్సర్లు, 5 ఫోర్లు ఉండడం విశేషం. అలాగే శివాలిక్ శర్మ (17 బంతుల్లో 55 పరుగులు), అభిమన్యు సింగ్(17 బంతుల్లో 53 పరుగులు), సోలంకి (16 బంతుల్లో 50 రన్స్), శశ్వత్ రావత్(16 బంతుల్లో 43)రాణించారు.
అంతకుముందు గాంబియాపై జింబాబ్వే పేరిట ఉన్న 344/4 ఆల్ టైమ్ రికార్డును బరోడా బద్దలు కొట్టింది. దీంతో పాటు నేపాల్ పేరిట ఉన్న 314, ఇండియా పేరిట ఉన్న 297 రికార్డులను సైతం బద్దలు కొట్టింది. బరోడా అత్యధిక పరుగులు స్కోరు చేసిన జట్టుగా నిలిచింది.
తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సిక్కిం 20 పరుగులకే తొలి 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 86 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 263 పరుగుల తేడాతో బరోడా ఘన విజయం సాధించింది. రాబిన్(20), అంకుర్(18), పలావత్(12) పరుగులు చేయగా.. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు.