Site icon Prime9

INDIA vs SRILANKA : టీమ్ ఇండియా కొంపముంచిన అర్ష్‌దీప్ సింగ్… 5 నో బాల్స్, 37 రన్స్ ?

arsh deep no balls leads to india loss against srilanka in 2nd t20 match in pune

arsh deep no balls leads to india loss against srilanka in 2nd t20 match in pune

INDIA vs SRILANKA : పూణెలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. భారత్ పై శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్ధేంచిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్… 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ శతకాలతో రాణించినా జట్టును విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోయారు. అయితే భారత్ ఓటమికి మన ప్లేయర్స్ చేజేతులా చేసుకున్న తప్పిదాలే కారణంగా తెలుస్తున్నాయి. బౌలింగ్ విషయంలో మన వాళ్లు ఆశించిన మేర రాణించలేకపోయారు. ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీసినప్పటికీ ఒక్కో ఓవర్ కు 12 పరుగులు సమర్పించుకున్నాడు. శివమ్ మావి 4 ఓవర్లలో ఓవర్ కు 13కు పైనే పరుగులు ఇచ్చాడు. ఇక అర్షదీప్ గురించి అయితే చెప్పే పనేలేదు. రెండు ఓవర్లు బౌలింగ్ చేయగా… 5 నో బాల్స్ వేసి 37 పరుగులు ఇచ్చాడు. అక్షర్ పటేల్ ఒక్కడు మాత్రమే రెండు వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు.

కాగా ఈ మ్యాచ్‌ లో కేవలం 2 ఓవర్లు వేసిన అర్ష్‌దీప్‌ ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా పలు చెత్త రికార్డులను అర్ష్‌దీప్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌ చరిత్రలో హ్యాట్రిక్‌ నోబాల్స్‌ వేసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అదే విధంగా టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్‌ వేసిన తొలి టీమిండియా బౌలర్‌గా కూడా అర్ష్‌దీప్‌ చెత్త రికార్డు నెలకొల్పాడు. గాయంతో మొదటి మ్యాచ్‌కి దూరమైన అర్ష్‌దీప్‌ ఈ మ్యాచ్ లో ఇలాంటి బౌలింగ్ వేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు.

ఇన్నింగ్స్ ఆరంభంలో అర్షదీప్ సింగ్ బౌలింగ్ చేయగా, ఒక్క ఓవర్ కే భారీగా పరుగులు ఇచ్చాడు. ఇక మళ్ళీ 19వ ఓవర్ లో మరోసారి బౌలింగ్ చేశాడు. అర్షదీప్ సింగ్ రెండు ఓవర్లలో మొత్తం ఐదు నో బాల్స్ వేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మొదటి ఓవర్ లోనే హ్యాట్రిక్ నోబాల్స్ వేయడంతో అంతా షాక్ అయ్యారు. ఇక అర్షదీప్ సింగ్ నో బాల్ కు భారీ మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది. శ్రీలంక కెప్టెన్ దాసున్ షణక అవుట్ కాగా, నో బాల్ కావడంతో బతికిపోయాడు. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ను చూసి ఏం చేయాలో తెలియలేక కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా గ్రౌండ్‌లోనే ముఖం దాచుకోవడం గమనార్హం. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో నిష్ణాతుడని నిరూపించుకున్న అర్ష్‌దీప్ ఈ మ్యాచ్ తో అందరిని నిరాశ పరిచి ఇండియా ఓటమికి ఒక కారణం అయ్యాడని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. కాగా ఈ ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మొత్తం 7 నో బాల్స్‌ వేసింది. దీని కారణంగానే లంక భారీస్కోరు చేసింది.

Exit mobile version