Site icon Prime9

Union minister JP Nadda: ఆరేళ్లలో అడ్డుకట్ట వేద్దాం.. హెచ్‌ఐవీపై పోరుకు ప్రభుత్వం సిద్ధం

Union minister JP Nadda says AIDS deaths drop: దేశంలో ఎయిడ్స్‌తో మరణాలు 2010 నాటి గణాంకాలతో పోలిస్తే 2023లో 79 శాతం మేర తగ్గాయని, హెచ్‌ఐవి కేసులు 44 శాతం పడిపోయాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా ఆదివారం వెల్లడించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఇండోర్‌లో ఒక కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ, 2010 నుంచి దేశంలో కొత్త హెచ్‌ఐవి కేసుల్లో 44 శాతం తగ్గుదల 39 శాతంగా ఉన్న ప్రపంచ తగ్గుదల రేటు కన్నా అధికం అని పేర్కొన్నారు.

అదే లక్ష్యం
2030 నాటికి ఎయిడ్స్‌ను నిర్మూలించాలన్న ఐక్యరాజ్య సమితి (యుఎన్) సుస్థిర అభివృద్ధి లక్షం సాధించేందుకు దేశం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. దేశంలో ప్రస్తుతం సాగుతున్న జాతీయ ఎయిడ్స్, ఎస్‌టిడి నియంత్రణ కార్యక్రమం ఐదవ దశను నడ్డా ఈ సందర్భంగా ఉటంకించారు. ‘పరీక్ష, చికిత్స’కు సంబంధించి పునరుద్ధరించిన ఐడిఎస్ స్పందన చర్యలు, యూనివర్శల్ వైరల్ లోడ్ పరీక్షను ధ్రువీకరించనున్నట్లు, ఎయిడ్స్ (నివారణ, నియంత్రణ)చట్టం 2017ను పూర్తిగా అమలు పరచనున్నట్లు నడ్డా తెలియజేశారు.

అడ్డుకట్ట వేద్దాం
ప్రపంచంలో ప్రస్తుతం ఎయిడ్స్ కేసులు 0.70 శాతంగా ఉన్నాయని, భారత్‌లో అవి 0.20 శాతం అని ఆయన చెప్పారు. ఎయిడ్స్‌పై సుదీర్ఘ పోరాటం అనంతరం ఈ వ్యాధిని ఎదుర్కొనడానికి దేశంలో పటిష్ఠమైన వైద్య విధానాన్ని అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. కేంద్రం ఎయిడ్స్ మందులను రోగులకు ఉచితంగా సమకూరుస్తున్నదని, హెచ్‌ఐవి పాజిటివ్‌గా తేలినవారికి వెంటనే మందులు ఇస్తున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలియజేశారు. భారతీయ ఔషధ సంస్థలు అత్యంత చౌక అయిన, సమర్థమైన ఎయిడ్స్ మందులను ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, లాటిన్ అమెరికాలకు సరఫరా చేస్తున్నదని నడ్డా వెల్లడించారు. ఉపాధి, ఇతర రంగాల్లో హెచ్‌ఐవి బాధితుల పట్ల వివక్ష లేకుండా చూస్తున్నట్లు నడ్డా స్పష్టం చేశారు.

Exit mobile version