Union Home Minister Amit Shah: మత ఆధారిత రిజర్వేషన్లు అనుమతించం.. ‘సంకల్ప్‌ పత్ర’పేరుతో మ్యానిఫెస్టో విడుదల

Maharashtra Assembly Elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ)లతో కూడిన ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి ప్రయత్నిస్తోండగా.. బీజేపీ కూడా గెలిచేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ‘సంకల్ప్‌ పత్ర’పేరుతో దీనిని విడుదల చేసి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది..
మ్యానిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని షా అన్నారు. యువకులు, పేదలు, రైతులు, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు రూపొందించామని పేర్కొన్నారు. స్కిల్ సెన్సస్, స్టార్టప్‌ల అభివృద్ధి కోసం శివాజీ మహారాజ్ కేంద్రం, ఇంక్యుబేషన్ సెంటర్లు, వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలిపారు.

ప్రతిపక్ష కూటమి వాగ్దానాలను విస్మరించింది..
ప్రతిపక్ష కూటమి వాగ్దానాలను విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ దేశంలో మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ అనుమతించదని పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలో సుస్థిరమైన, విశ్వసనీయమైన పరిపాలన ఉండాలంటే మహాయుతి ప్రభుత్వం అధికారంలో కొనసాగాలని స్పష్టం చేశారు. అన్ని కులాలు, వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చామని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. రాష్ట్రాన్ని వికసిత్‌ మహారాష్ట్రగా మార్చేందుకు రోడ్‌ మ్యాప్‌ను రూపొందించామన్నారు.

బీజేపీ సంకల్ప్‌ పత్రలో కీలక హామీలు..

  • లడ్కీ బెహన్‌ స్కీమ్‌ కింద నెలవారీ ఇస్తున్న మొత్తాన్ని రూ.1500 నుంచి రూ.2100కు పెంపు
  •  వ్యవసాయ రుణాలు మాఫీ, ఆహార భద్రతకు హామీ, నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణకు చర్యలు
  • యువతకు 25లక్షల కొత్త ఉద్యోగాల కల్పన, రాష్ట్రంలో పది లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.10వేలు చొప్పున స్టైఫండ్‌
  • 45వేల గ్రామాలకు కొత్త రోడ్ల నిర్మాణం
  • పునరుత్పాదక ఇంధనంపై దృష్టిసారిస్తూ విద్యుత్‌ బిల్లులను 30శాతం మేర తగ్గింపు
  • అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విజన్‌ మహారాష్ట్ర 2028 విడుదల
  •  మహారాష్ట్రను 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం
  •  2027నాటికి రాష్ట్రంలో 50లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేయడం
  •  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏఐ శిక్షణ, నైపుణ్య గణన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతు
  • వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక సాయం, ప్రజలకు ఆరోగ్య బీమా