Tamil Nadu cm Mk stalin : లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు తగ్గుతాయని సీఎం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై తాజాగా మరోసారి స్పందించారు. పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా వివాహం చేసుకున్న జంటలు అత్యవసరంగా పిల్లలను కనాలని కోరారు.
ఇప్పుడు పరిస్థితులు మారాయి..
నాగపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడారు. కొత్త దంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో తాను చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం ప్రణాళికలు రచిస్తోన్న సందర్భంగా తాను ఏమి చెప్పలేనన్నారు. అంతకుముందు తమ ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై దృష్టిసారించినట్లు చెప్పారు. కానీ, ఇప్పుడు జనాభా పెంచుకోక తప్పని పరిస్థితుల్లోకి నెట్టివేయబడినట్లు పేర్కొన్నారు. అందుకే కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు త్వరగా పిల్లలను కని, మంచి తమిళ్ పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇటీవల సీఎం వ్యాఖ్యలు..
ఇటీవల కొళత్తూర్‌లోని ఓ వివాహ వేడుకల్లోనూ సీఎం స్టాలిన్ ఇదేతరహా వ్యాఖ్యలు చేశారు. పరిమితికి మించకుండా పిల్లలను కనాలని, మంచి సంపదతో జీవించాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని చేపట్టామన్నారు. కానీ, దీని కారణంగా రానున్న రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లోక్‌సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు, ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 5న సీఎం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఇందులో పాల్గొనాలని ఎన్నికల సంఘం గుర్తింపుపొందిన రాష్ట్రంలోని 40కు పైగా పార్టీలకు ఆహ్వానం పంపారు. లోక్‌సభ నియోజవర్గాల పునర్విభజన పనులను కేంద్ర ప్రభుత్వం 2026లో చేపట్టనున్న నేపథ్యంలో జనాభా ఆధారంగా ఇది జరిగితే రాష్ట్రానికి 8 నియోజకవర్గాల వరకు తగ్గుతాయని స్టాలిన్ ఆందోళన వ్యక్తంచేశారు.