Supreme Court : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫారంపై గెలిచి, అధికార పార్టీ కాంగ్రెస్‌లోకి వెళ్లిన పది ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపి స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధుల పదవీకాలం పూర్తయ్యే వరకు కూడా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం ఇంక విలువలు ఏముంటాయని స్పీకర్‌ను ప్రశ్నించింది. దీనిపై స్పీకర్ తరఫున న్యాయవాది స్పందించారు. ఇప్పటి వరకు తమకు నోటీసులు అందలేదని కోర్టుకు తెలిపారు. వీరి వాదనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రతివాదులైన అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 22లోపు సమాధానం ఇవ్వాలి..
నోటీసులకు ఈ నెల 22వరకు సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. తమ పార్టీ బీ ఫారంపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను హైకోర్టు సింగిల్ చెంచ్ విచారించింది. ఈ క్రమంలోనే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ, అసెంబ్లీ కార్యదర్శి ప్రత్యేక బెంచ్‌కు అప్పీల్ చేసుకోగా, అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం తీసుకోవాలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా, ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.