Sukanya Samriddhi Yojana Scheme for Girls: కేంద్ర ప్రభుత్వం పొదుపులకు సంబంధించి ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ఆడపిల్లల కోసం కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకంపై ఇప్పటికీ చాలామందికి అవగాహన లేకపోవడంతో పొదుపు చేసుకునేందుకు దూరమవుతున్నారు. అయితే, ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? ఈ పథకం ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం.
కేంద్రం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని బ్యాంకులు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉంటాయి. అధికారులు సంప్రదించి ఆడపిల్లల పేరిట ఖాతాలను ఓపెన్ చేయవచ్చు. అయితే కుటుంబంలో పదేళ్లలోపు ఆడపిల్లలు ఉంటే ఈ పథకాన్ని అస్సలు మిస్ కావొద్దని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం కేవలం ఆడపిల్లల కోసమేనని, ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉన్నత చదువులు, వ్యాపారం, వివాహం వంటి దృష్ట్యా ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని వెల్లడిస్తున్నారు. ఈ పథకం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతీ నెల తగిన మోతాదులో చేసే పొదుపునకు వడ్డీ వస్తుంది. ప్రతీ నెలా చేసే పొదుపు 15 ఏళ్లకు భవిష్యత్తులో అధిక మొత్తంలో మెచ్యూరిటీ వస్తుంది.
ఈ పథకంలో భాగంగా ప్రతి ఆర్ధిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5లక్షల రకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. నెలకు కనీసం రూ.250 నుంచి రూ.5 వేల వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఏడాది మొత్తం పెట్టుబడిని ఒకేసారి కూడా డిపాజిట్ చేసేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు నెలకు కొంత మొత్తంను 15ఏళ్ల పాటు డిపాజిట్ చేయాలి. ఆడపిల్లల వయస్సు 18 ఏళ్లు వచ్చాక ఆ సమయంలో మెచ్యూరిటీలో కొంత మొత్తంను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా, 21 ఏళ్ల తర్వాత మొత్తం మెచ్యూరిటీ పొందుతారు. ఈ సమయంలో ఉన్నత విద్య, వివాహ ఖర్చులకు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇక, వడ్డీరేట్లను కేంద్రం 3 నెలలకోసారి సవరిస్తుంటుంది. ఇందులో భాగంగానే గతంలో 7.6 శాతం వడ్డీ రేటు ఉండగా.. ఇటీవల 40 బేసిస్ పాయింట్లు పెంచుతూ వడ్డీ రేటును 8 శాతానికి పెంచింది. దీంతో కొంతమేర మెచ్యూరిటీ పెరగవచ్చు. ఉదాహరణకు ఈ పథకం తీసుకున్న ఆడపిల్ల ఖాతాలో నెలకు రూ.12,500 డిపాజిట్ చేసుకుంటూ వెళ్లగా ఏడాదికి 1,50,000 చేసినట్లు అవుతోంది. ఇలా ఏడాదికి 1,50,000 పెట్టుబడిగా 15 ఏళ్లకు రూ.22.5 లక్షలు చెల్లించేందుకు అవకాశం ఉంది. దీనికి వడ్డీని కలిపి మొత్తం డిపాజిట్ చేసిన దానికి అదనంగా రూ.46.77 లక్షలు వస్తుంది. మొత్తం దాదాపు రూ.70 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంటుందని, భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగితే మెచ్యూరిటీ మరింత పెరిగే అవకాశం ఉంది, ఇందులో 80(C ) కింద పన్ను మినహాయింపు కూడా ఉండడం విశేషం.
అందుకే ఆడ పిల్లలు ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ పథకాన్ని మిస్ చేయకుండా 15 ఏళ్ల పాటు కట్టుకుంటే భవిష్యత్తులో మంచిగా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం 10 ఏళ్లు ఆడపిల్లలు ఉన్న ప్రతీ తల్లిదండ్రులు ఇప్పుడే మీకు దగ్గరగా ఉన్న పోస్టాఫీసు లేదా బ్యాంకులను సంప్రదించి ఈ పథకంలో చేరాలని అధికారులు వెల్లడిస్తున్నారు.