PM Narendra Modi: పెట్టుబడులే లక్ష్యంగా.. కువైట్‌ పర్యటనలో ప్రధాని మోదీ

Prime Minister Narendra Modi arrives in Kuwait: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం శనివారం కువైట్‌ చేరుకున్నారు. కువైట్ పాలకుడు షేక్ మిషాల్ అల్‌అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. కాగా, భారత ప్రధాని కువైట్‌కు 43 ఏళ్ల తర్వాత వెళ్లటం, సిరియా ఉద్రికత్తల నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లో 1981లో చివరిసారిగా ఇందిరాగాంధీ కువైట్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.

ద్వైపాక్షిక చర్చలు..
తన పర్యటనలో కువైట్ అగ్ర నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, వాణిజ్యంపై ప్రధాని దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో పలు ఒప్పందాలు కుదిరే అవకాశముందని విదేశీ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. భారత్‌, గల్ఫ్‌ సహకారమండలి (జీసీసీ) మధ్య సంబంధాల బలోపేతంపై ముఖ్యంగా ఇరుదేశాల నేతలు చర్చించనున్నారు.

కువైట్‌ సారథ్యంపై..
జీసీసీ కౌన్సిల్‌లో యూఏఈ, బహ్రయిన్‌, సౌదీ అరేబియా, ఒమన్‌, ఖతార్‌, కువైట్‌ దేశాలు సభ్యులుగా ఉండగా, ఈ కూటమికిప్రస్తుతం కువైట్‌ సారథ్యం వహిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీసీసీ దేశాలతో భారత్‌ 184.46 బిలియన్‌ డాలర్ల మేర వాణిజ్యం సాగించిందని, దీనిని రెట్టింపు చేయటమే ప్రధాని పర్యటన లక్ష్యమని తెలుస్తోంది.

నెటిజన్‌ ‘తాత’తో భేటీ..
ఈ పర్యటనలో భాగంగా కువైట్‌లో జరిగే ‘హలా మోదీ’కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు 4 వేల మంది ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటించారు. గతంలో తాను ఇచ్చిన మాట ప్రకారం.. ఈ కార్యక్రమానికి హాజరైన 101 ఏళ్ల మంగళ్‌ సేన్‌ హండా అనే మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారిని మోదీ కలిసి, ఆయనతో ఆత్మీయంగా మాట్లాడారు. తన తాత.. మంగళ్‌ సేన్‌ హండాను కలవాలంటూ ‘ఎక్స్‌’ వేదికగా ఆయన మనవరాలు చేసిన అభ్యర్థనకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు ప్రవాసభారతీయులంతా చప్పట్లు, వందేమాతరం నినాదాలతో హోరెత్తిస్తుండగా.. రామాయణం, మహాభారతాలను అరబిక్‌లో అనువదించిన అబ్దుల్లా అల్ బరూన్, ఈ ఇతిహాసాల అరబిక్ వెర్షన్‌లను ప్రచురించిన అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్‌లనూ మోదీ పలకరించారు.