Prime9

38th National Games: డెహ్రాడూన్ వేదికగా 38వ జాతీయ క్రీడలు.. ప్రారంభించిన భారత ప్రధాని మోదీ

PM Narendra Modi to inaugurate India’s 38th National Games in Dehradun: క్రీడాకారుల కేరింతలు, క్రీడాభిమానుల హర్షధ్వానాలు, వేలాది ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య 38వ జాతీయ క్రీడలు  ప్రారంభమయ్యాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు, చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శనలు, మనసును మైమరిపించే సంగీతం సాగుతుండగా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియంలో భారత ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ క్రీడాపోటీలను అధికారికంగా ప్రారంభించారు. గాయకుల పాటలకు అనుగుణంగా స్టాండ్స్‌లోని ప్రేక్షకులు స్టెప్పులతో స్టేడియాన్ని హోరెత్తించగా, పలు విద్యాసంస్థల నుంచి తరలి వచ్చిన విద్యార్థులు, యువత, క్రీడాభిమానులతో జాతీయ క్రీడలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ వేడుకకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

అందుకే ఉత్తరాఖండ్‌లో..
ఉత్తరాఖండ్‌ ఆవిర్భావానికి 25 ఏళ్లు అవుతున్ననేపథ్యంలో ఈసారి జాతీయ క్రీడల నిర్వహణ అవకాశం ఆ రాష్ట్రానికి దక్కింది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లోని 7 నగరాల్లో జరగనున్నాయి. ఆ రాష్ట్ర పక్షి ‘మోనాల్‌’స్ఫూర్తితో ఈ క్రీడలకు ‘మౌలి’మస్కట్‌ను తయారుచేశారు. ఉత్తరాఖండ్ ప్రకృతి అందాలను, ఘనమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటేలా దానిని తీర్చిదిద్దారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగే ఈ క్రీడల్లో 26 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పాల్గొంటున్నాయి. ఈ పోటీలలో 32 క్రీడాంశాల్లో దాదాపు 10వేల మంది ప్లేయర్లు పోటీపడనుండగా, వీరిలో 49 శాతం మంది మహిళలే. అథ్లెట్ల సంఖ్య ప్రకారం చూస్తే ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద క్రీడా టోర్నీ. రాష్ట్ర జట్లతో పాటు, సైనిక దళాల జట్లూ ఈ క్రీడల్లో పాల్గొంటున్నాయి.

కొత్త క్రీడాంశాలు..
ఒలింపిక్‌ క్రీడలైన అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ, బాక్సింగ్‌ తదితర వాటితో పాటు సంప్రదాయ ఆటలు కబడ్డీ, ఖోఖోనూ నిర్వహిస్తున్నారు. కేరళకు చెందిన కలరిప్పయట్టు, యోగాసన, మల్లఖంబ్, రాఫ్టింగ్‌ను కేవలం ప్రదర్శన కోసమే క్రీడల జాబితాలో చేర్చారు. వీటికి పతకాలు ఇవ్వరు. ఈ జాతీయ క్రీడలలో తెలంగాణ తరపున 22 క్రీడాంశాల్లో 205 మందిని బరిలో దిగనునుండగా, ఏపీ నుంచి 155 మంది పాల్గొంటున్నారు.

ఒలింపిక్స్ వేదిక మనదే
శతాబ్దాల భారత సభ్యత, సంస్కృతికి ఆటలు ప్రతీకగా నిలుస్తున్నాయి. అందరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి. జాతీయ క్రీడల్లో అథ్లెట్ల ప్రదర్శన.. దేశానికి కొత్త విశ్వాసాన్ని అందిస్తుందని నమ్ముతున్నా. జాతీయ క్రీడలు ఆరంభమయ్యాయని ప్రకటిస్తున్నా” అని మోదీ ప్రసంగించారు. అనంతరం అన్ని రాష్ట్రాల జట్లు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నాయి.

రెండు బృందాలుగా ఏపీ ఆటగాళ్లు..
ఏపీలో రెండు బృందాలుగా ఆటగాళ్లు పాల్గొన్నారు. ప్రస్తుతం ఏపీలో రెండు ఒలింపిక్ సంఘాలు.. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం గుర్తింపు తమకి ఉందంటే.. తమకే ఉందంటూ వాదించుకుంటున్నాయి. జాతీయక్రీడల నేపథ్యంలో దీనిపై క్లారిటీ కోసం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) డిసెంబరు 6న భారత ఒలింపిక్ సంఘానికి లేఖ రాసినా దానిమీద ఎలాంటి క్లారిటీ అక్కడి నుంచి రాలేదు. దీంతో.. శాప్ క్రీడా సమాఖ్యల తరపున 87 మందిని జాతీయ క్రీడలకు పంపగా, రాష్ట్ర ఒలింపిక్ సంఘాల్లోని ఒక సంఘం తరపున 68 మంది హాజరవుతున్నారు. మొత్తంగా రాష్ట్రం తరఫున 21 క్రీడాంశాలకు 155 మంది అర్హత సాధించారు. ఆడాలనే కసి, గెలవగలమనే నమ్మకం, పోరాడే సామర్థ్యం ఇలా.. అన్నీ ఉన్నప్పటికీ క్రీడా సమాఖ్యల్లో తిష్టవేసిన రాజకీయ నాయకుల వర్గ విభేదాల మూలంగా ఏపీ ఆటగాళ్లు నలిగిపోతున్నారు. గత ఐదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది.

Exit mobile version
Skip to toolbar