PM Narendra Modi in Maharashtra elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గురువారం ఛత్రపతి శంభాజీ నగర్‌లో అధికార కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అధికారం కోసం కాంగ్రెస్ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ విభజనను నమ్ముతోందన్నారు. కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకోవడం లేదన్నారు. హస్తం పార్టీ మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు. గతంలో రిజర్వేషన్లపై కాంగ్రెస్ తీరుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయని తెలిపారు. వీడియోలను పరిశీలిస్తే కాంగ్రెస్ ఆలోచన ఏంటో అవగతం అవుతుంన్నారు. కాంగ్రెస్ లో నాటి నుంచి నేటి వరకు ఎలాంటి మార్పు రాలేదని ఆరోపించారు.
ఆర్టికల్ 370 పునరుద్ధరణకు ప్రయత్నం..
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పథకం రచిస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పాకిస్థాన్ భాష మాట్లాడుతుందని, కాంగ్రెస్ మిత్రపక్షాలకు మహారాష్ట్ర ప్రజలు మద్దతు ఇస్తారా..? ఎప్పటికీ భారత్‌లో కశ్మీర్ భాగమే అన్నారు. మన రాజ్యాంగమే అక్కడ అమలు అవుతోందని మోడీ అన్నారు. మహాయుతి ప్రభుత్వం ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చిందన్నారు. దీంతో బాల్ ఠాక్రే కోరికను మహాయుతి సర్కారు నెరవేర్చిందని వ్యాఖ్యానించారు.