Site icon Prime9

Dolo 650: డోలో టాబ్లెట్ల కోసం వెయ్యి కోట్లరూపాయల గిఫ్ట్స్ ఇచ్చారా?

Dolo 650: ప్రతి ఇంట్లోను ఈ టాబ్లెట్ తప్పకుండా ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా జర్వం వస్తే,  తప్పకుండా వాడేది డోలో టాబ్లెట్‌. ప్రస్తుతం ఇదే డోలో టాబ్లెట్‌కు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. డోలో టాబ్లెట్‌ తయారు చేసే కంపెనీ బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్‌ రెప్రిజెంటెటివ్‌ బాడీ ఎఫ్‌ఎంఆర్‌ఏఐ డోలో కంపెనీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. డాక్టర్లకు సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు గిఫ్ట్‌లు ఇచ్చి ప్రసన్నం చేసుకొని పెషంట్లకు ఇష్టం వచ్చినట్లు డోలో టాబ్లెట్లు ప్రిస్కైబ్‌ చేయాలని ఒత్తిడి చేశాయని ఎఫ్‌ఎంఆర్‌ఏఐ ఫిర్యాదు చేసింది.

ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రెప్రజెంటేవివ్స్‌ అసోసియేషన్‌ తరపున సంజయ్‌ ఫారిక్‌ ఈ కేసుకు ప్రాతినిధ్యం వహించారు. కరోనా సమయంలో డాక్టర్లు ఇష్టం వచ్చినట్లు డోలో -650 టాబ్లెట్లను ప్రిస్క్కైబ్‌ చేశారని ఆరోపించారు. దీనికి ఆయన సీబీడీటి రిపోర్టును ఉదాహరణగా చూపించారు. సుప్రీంకోర్టు జడ్జిలు డీవై చంద్రచూడ్‌, ఎ ఎస్‌ బొపన్న బెంచ్‌ ముందు పారిఖ్‌ ఈ కేసుకు సంబంధించి తన వాదన వినిపించారు. డోలో- 500 టాబ్లెట్‌పై నియంత్రణ ఉంది కాబట్టి ఎక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉండదు. ఇక్కడే కంపెనీ డోలో 650 ఎంజీ టాబ్లెట్‌ను ప్రిస్ర్కైబ్‌ చేయమని డాక్టర్లకు చెప్పి బలవంతంగా పెషంట్లతో కొనిపించి పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జించిందని వివరించారు. దీని కోసం కంపెనీ డాక్టర్లను ప్రసన్నం చేసుకోవడానికి సుమారు వెయ్యి కోట్ల వరకు ఉచితాలను అందజేసిందనేది ఫారిక్‌ వాదన.

ఇదిలా ఉండగా గత నెల 13న ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) డోలో 650 తయారు చేసే కంపెనీ అనైతిక చర్యలకు పాల్పడిదంటూ ఆరోపించింది. తమ ప్రొడక్టు అమ్మకాలు పెంచుకొనేందుకు డాక్టర్లకు సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు గిఫ్ట్‌లు పంచిపెట్టిందని ఒక నివేదికలో వెల్లడించింది. గత నెల 6 వ తేదీన ఆదాయపు పన్ను శాఖ బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న మైక్రోలాబ్స్‌కు చెందిన కార్యాలయాపై దాడులు నిర్వహించింది. దేశంలోని తొమ్మిది రాష్ర్టాల్లో ఈ దాడులు జరిగిన తర్వాత సీబీడీటీ నివేదికలో విడుదల చేసింది. కరోనా సమయంలో కరోనా వచ్చినా రాకపోయినా డాక్టర్లు మాత్రం డోలో -650ని తప్పకుండా ప్రిస్కైబ్‌ చేయడం మొదలుపెట్టారు. దీంతో డోలో అమ్మకాల్లో రికార్డు బద్దలు కొట్టిందని మీడియాలో కూడా వార్తలు వచ్చాయని పేర్కొంది. సుప్రీంకోర్టు జడ్జి వైవి చంద్రచూడ్‌ తాను కూడా కరోనా వచ్చినప్పడు డోలో వేసుకున్నానని చెప్పారు. తాజాగా డోలో-650 కంపెనీపై వస్తున్న ఆరోపణలపై ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్రప్రభుత్వం ప్రతినిధి ఎఎస్‌జీ కెకె నటరాజన్‌ వాదిస్తూ, కంపెనీ ఇస్తున్న గిఫ్ట్‌ల గురించి స్పందించారు. దీనికో ప్రత్యేక చట్టం ఉందని, ఫైనాన్స్‌ చట్టం ప్రకారం కంపెనీలు డాక్టర్లకు గిఫ్ట్‌గా ఇచ్చే మొత్తం పై ఎలాంటి టాక్స్‌ బెనిఫిట్‌ లభించదని తెలిపారు. కంపెనీకి పన్ను రాయితీ లభించదని స్పష్టం చేశారు. కాగా ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రెప్రజెంటెటివ్‌ అసోసియేషన్‌ మాత్రం ఫార్మాస్యూటికల్‌ మార్కెటింగ్‌ ప్రాక్టిసెస్‌కు యూనిఫాం కోడ్‌ విధించాలని, దీంతో పాటు ధర నిర్ణయం పాదర్శకతో పాటు జవాబుదారీ తనంతో ఉండాలని కోరింది. కాగా సుప్రీంకోర్టు బెంచ్‌ సోలిసిటర్‌ జనరల్‌ను ఈ కేసుకు సంబంధించి పది రోజుల్లోగా స్పందించాలని ఆదేశించింది. దీనిపై జస్టిస్‌ చంద్రచూడ్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది సీరియస్‌ మాటర్‌ అని వ్యాఖ్యానించారు. తదుపరి విచారణ సెప్టెంబర్‌ 29కి వాయిదా వేశారు.

ఫార్మా కంపెనీలు కాస్తా ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తే మేలు. సొంత లాభం కొంత మానుకొని పొరగువాడికి సాయపడవోయి అని మన తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పినట్లు ఆ బాటలో కంపెనీలు నడిస్తే ప్రజలు సంతోషిస్తారు. లేదంటే ప్రజల నుంచి విమర్శలు తప్పవు. ప్రస్తుతం బాలీవుడ్‌లో నడుస్తున్నట్రెండ్‌ బాయ్‌కాట్‌ బాలీవుడ్‌ లా, బాయ్‌కాట్‌ డోలో -650 అని తెచ్చుకోకుండా ఉంటే మంచిదని కంపెనీకి ప్రజలు హితవు చెబుతున్నారు.

Exit mobile version