Site icon Prime9

National Green Hydrogen Mission: హరిత ఇంధనం.. ప్రగతి సాధనం

National Green Hydrogen Mission: మన దేశంలో ఏటికేడు విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోతోంది. గత దశాబ్దాకాలంలో మన తలసరి విద్యుత్ వినియోగం 918 యూనిట్ల నుంచి 1,255 యూనిట్లకు పెరిగింది. అయితే, పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానా మీద ఆర్థిక భారం పెరగటమే గాక పర్యావరణ పరమైన ప్రతికూల ప్రభావాలనూ దేశం ఎదుర్కోవాల్సి వస్తోంది. రాబోయే 30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను వాడే దేశంగా నిలవనుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) విడుదల చేసిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఔట్‌లుక్‌ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2050 నాటికి మొత్తం ఆఫ్రికా ఖండంలోని మొత్తం దేశాలు వాడే కరెంటు కంటే అధికంగా మనదేశంలో విద్యుత్ వినియోగంలోకి రానుంది. మన దేశంలో ఇంధన సరఫరా 2022లో 42 ఎక్సాజౌల్స్‌ (ఈజే)గా ఉండగా అది 2030 నాటికి 53.7 ఈజేగా, 2050 నాటికి 73 ఈజేగా పెరుగనుందని ఈ నివేదిక వెల్లడించింది. దేశంలో విద్యుత్ తయారీ కేంద్రాలలో 70 శాతం బొగ్గుమీద ఆధారపడినవే కావటంతో పెద్దమొత్తంలో కర్బన ఉద్గారాలు విడుదలై పర్యావరణం కోలుకోలేని రీతిలో దెబ్బతింటోంది. ఇదిలాగే కొనసాగితే, సమీప భవిష్యత్తులో భూతాపాలు పెరిగి, అతివృష్టి, అనావృష్టి, కరువు వంటి విపత్కర పరిణామాలు తలెత్తటం ఖాయమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించాలంటే.. దేశం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద దృష్టి సారించాల్సిందేనని వారు సూచిస్తున్నారు. థర్మల్ విద్యుత్ కంటే 35 శాతం తక్కువ ఖర్చుతోనే మన ఇంధన అవసరాలను తీర్చుకోగలగటమే గాక పర్యావరణాన్నీ కాపాడుకున్నట్లవుతుంది.

విశాలమైన భారత భూభాగంలోని 70 శాతం ప్రాంతాల్లో ఏడాదిలో 300 రోజుల పాటు సూర్యరశ్మి అందుబాటులో ఉంటుంది గనుక దేశంలో భారీ స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయని ‘జాతీయ సౌర విద్యుత్ సంస్థ’ నిర్ధారించింది. తాజాగా 2024, ఫిబ్రవరి 15న కేంద్రం ‘పీఎం సూర్యఘర్: ముఫ్త్ బిజలీ యోజన’ పేరిట ఒక పథకాన్ని ప్రకటించింది. దేశంలోని కోటి ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకునేలా పౌరులను ప్రోత్సహించి, ఆ ఉత్పత్తి అయిన సౌర విద్యుత్‌లో తమ అవసరాలు పోనూ, మిగిలిన దానిని ప్రభుత్వ గ్రిడ్‌కు అమ్ముకోవటానికి ఈ పథకం వీలు కల్పిస్తోంది. ఇలా.. నెలకు ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్ పొందడం వలన ఏటా ప్రతి కుటుంబానికి 15 నుంచి 18 వేల వరకు ఆదా అవుతుందని, ఈ విధానం వల్ల సరఫరా దశలో విద్యుత్ నష్టం గానీ, వోల్టేజ్ సమస్యలుగానీ ఉండవని నిపుణులు నిర్ధారించారు. ఈ పథక లబ్దిదారులకు కేంద్రం ఇచ్చే రాయితీని (కిలోవాట్) రూ.14 వేల నుండి రూ.18 వేలకు పెంచింది. దేశం మొత్తంలో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుదుత్పాదనలో 18.7 గిగావాట్లతో రాజస్థాన్, 10.5 గిగావాట్లతో గుజరాత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. బంజరు భూముల్లోనూ సౌర విద్యుదుత్పత్తి చేపట్టడం ద్వారా రైతులు ఆదాయం పొందేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసిఐ), భారత పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థ (ఐఆర్ఈడిఏ) తోపాటు మరికొన్ని ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.

సౌర విద్యుత్ తరువాత చౌకగా లభ్యమయ్యేది పవన విద్యుత్తే. మూడు వైపులా సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న భారత్‌లో 300 గిగా వాట్ల సామర్ధ్యంతో, ఇతర ప్రాంతాల్లో 195 గిగా వాట్ల సామర్ధ్యంతో పవన విద్యుత్ కేంద్రాలను నెలకొల్పే అవకాశం ఉందని జాతీయ పవన శక్తి సంస్థ, ప్రపంచ బ్యాంకు సంయుక్త నివేదిక వెల్లడించింది. ఈ అంచనాకు అనుగుణంగానే 2014లో కేంద్రం జాతీయ పవన విద్యుత్ విధానాన్ని తెచ్చింది. 2022 నాటికి 60 గిగా వాట్లు, 2030 నాటికి 500 గిగా వాట్ల సామర్ధ్యంతో కూడిన సాంప్రదాయేతర ఇంధన వనరుల విద్యుదుత్పత్తి కేంద్రాలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 2030 నాటికి 140 గిగా వాట్లు పవన శక్తి ద్వారా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా నేటికీ అది 42.87 గిగా వాట్లకే పరిమితం అయ్యింది. సముద్ర తీరాలు, ఎత్తైన కొండలపై పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ ప్రాంతాల్లో పవర్ లైన్ల ఏర్పాటుకు ముందుగా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి రావటం ఒక సమస్యగా ఉంది. అలాగే, తీర ప్రాంతాల్లో మారే వాతావరణాన్ని బట్టి విద్యుత్ ఉత్పత్తి స్థిరంగా సాగదు. అయితే.. 2030 నాటికి పవన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం సాకారం కావాలంటే ఈ రంగంలో వాడే పనిముట్లపై పన్నులు భారీగా తగ్గించడంతో పాటు, భూములను సమకూర్చేందుకు, విద్యుత్ సరఫరా వ్యవస్థలను నిర్మించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందడుగు వేయాలి.

సోలార్ పవర్ పగటిపూట మాత్రమే తయారవుతుంది. అయితే, చీకటి పడిన తర్వాతే విద్యుత్ వినియోగం పెరుగుతుంది. దీనివలన గ్రిడ్ స్థిరత్వానికి సవాళ్లు ఎదురౌతున్నాయి. అయితే పవన శక్తి లభ్యత రాత్రి వేళల్లో ఎక్కువ ఉంటుంది. అందుచేత సౌర, పవన విద్యుత్‌లను సమ్మిళితం చేయడం ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని సాధించవచ్చు. ఈ దిశగా చేపట్టే ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు 2018లో వచ్చిన ‘జాతీయ సౌర, పవన సమ్మిళిత విద్యుత్ విధానం’ ప్రకారం.. భారత సౌర ఇంధన సంస్థ (ఎస్ఈసిఐ) సమ్మిళిత విద్యుత్ కేంద్రాల స్థాపనకు చర్యలు చేపట్టింది. 2023లో దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాభావం వలన జల విద్యుదుత్పత్తి రికార్డు స్థాయిలో 17.33 శాతం పడిపోగా, ఆ లోటును పూడ్చేందుకు ధర్మల్ కేంద్రాల్లో 9.94 శాతం, పునరుత్పాదక కేంద్రాల్లో 10.86 శాతం విద్యుదుత్పత్తి పెంచారు. కొన్నేళ్లుగా పునరుత్పాదక ఇంధన వనరులతో విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రోత్సాహకాల పేరిట ప్రభుత్వాలు చేపట్టిన చర్యల ప్రయోజనం జల విద్యుదుత్పత్తి తగ్గిన సమయంలో ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం విద్యుత్తులో బొగ్గు ద్వారా ఉత్పత్తి 50 శాతం లోపే. దేశంలో బొగ్గు వాడకుండా సగానికి పైగా విద్యుత్ ఉత్పత్తి చేయడం గత ఆరు దశాబ్దాలలో ఇదే మొదటిసారి. మరోవైపు, పెట్రోలు, డీజిల్‌, సహజ వాయువు (గ్యాస్‌)కు ప్రత్యామ్నాయ ఇంధనంగా గ్రీన్ హైడ్రోజన్ వచ్చేస్తోంది. కాలుష్యం వెదజల్లకుండా, వ్యక్తిగత, వాణిజ్య రవాణాకు, పారిశ్రామిక అవసరాలకూ వినియోగించే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. ఈ ఇంధన ఉత్పత్తి త్వరలోనే పట్టాలెక్కేలా, కేంద్రం నిరుడు జనవరి మొదటి వారంలో ‘నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌’‌కు ఆమోద ముద్ర వేసింది. 2030 నాటికి 50 లక్షల టన్నుల వార్షిక గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలనేది దీని లక్ష్యం కాగా, ఈ దిశగా పరిశ్రమలు, పరిశోధనా సంస్థలను ప్రోత్సహించేందుకు రూ.19,744 కోట్లు కేటాయించారు. ఫలితంగా, రానున్న ఆరేళ్లలో ఈ రంగంలోకి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు రావటమే గాక రూ.1 లక్ష కోట్ల విలువైన కర్బన ఉద్గారాలను తగ్గించటం, కొత్తగా 6 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశమూ ఉంది.

ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నుంచి లభించిన విద్యుత్తును ఉపయోగించి, ఎలక్ట్రోలైజింగ్‌ ప్రక్రియ ద్వారా గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. పెట్రోలు, డీజిల్‌ మండించినప్పుడు కర్బన ఉద్గారాలు ఉత్పన్నం అవుతాయి. కానీ, హైడ్రోజన్‌ మండినప్పుడు ఇవి ఉత్పత్తి కావు. ప్రస్తుతం ఒక కిలో హైడ్రోజన్‌ ఉత్పత్తికి 2-3 డాలర్లు ఖర్చవుతోంది. ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ ఈ ఖర్చు దిగివస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే దీన్ని భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నారు. ఇక, దేశంలో ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) కేంద్రాల స్థాపిత సామర్ధ్యం 1.43 లక్షల మెగావాట్లు దాటింది. దీనిని 2030 నాటికి 500 గిగావాట్లకు చేర్చాలనేది లక్ష్యం. కరెంట్ వృథాను అరికట్టి, సౌర పవన విద్యుదుత్పత్తిని పెంచడం ద్వారా డిమాండుకు అనుగుణంగా సరఫరాను మెరుగు పరచుకోవచ్చు. వచ్చే ముఫై ఏళ్ళల్లో భారత్ లో విద్యుత్తుకు అత్యధిక డిమాండ్ ఉండబోతోంది. ఈ గిరాకీని తట్టుకోవడానికి హరిత ఇంధనం వైపు అడుగులు వేస్తే విద్యుత్ ఉత్పాదనకు బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల అవసరం చాలావరకు తగ్గుతుంది. కాబట్టి కర్బన ఉద్గారాలు తగ్గుముఖం పట్టి పర్యావరణానికి ఎనలేని మేలు జరుగుతుంది, తద్వారా ప్రకృతి విపత్తుల నుంచి కూడా దేశాన్ని రక్షించుకోవచ్చు.

Exit mobile version