Prime9

Mallikarjun Kharge : కుంభమేళాలో తొక్కిసలాట జరిగితే యోగి రాజీనామా చేశారా..? : బెంగళూరు ఘటనపై ఖర్గే

AICC President Mallikarjun Kharge fires on BJP : ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నెల 4వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. దీంతో అధికార కాంగ్రెస్‌పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, హోంమంత్రి పరమేశ్వర రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

తొక్కిసలాట ఘటనపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. కేవలం ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని చెప్పారు. కుంభమేళా సమయంలో జరిగిన తొక్కిసలాటకు ఎవరైనా రాజీనామా చేశారా..? అని ప్రశ్నించారు. కొవిడ్‌ సమయంలో చాలామంది మృతిచెందారని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా చేశారా..? అని ప్రశ్నించారు. ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. కానీ, ఇది ప్రమాదవశాత్తూ జరిగిందన్నారు. ఘటనపై తమ నాయకులు ఇప్పటికే క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు. సీఎం సిద్ధరామయ్య ఇటీవల ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.

 

18 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ టైటిల్‌ని గెలుచుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్‌ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 4వ తేదీన నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందగా, సుమారు 50 మంది గాయపడ్డారు. ఘటనకు కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యమే కారణమని బీజేపీ ఆరోపించింది. ముందు జాగత్తగా తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

Exit mobile version
Skip to toolbar