Site icon Prime9

Lok Sabha: జమిలిపై ముందుకే.. నేడు లోక్‌సభ ముందుకు బిల్లు

Jamili Election Bill To Be Tabled in Lok Sabha On Today: దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా రూపొందించిన జమిలి ఎన్నికల బిల్లు నేడు లోక్‌సభ ముందుకు రానుంది. దీనికి సంబంధించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఇప్పటికే ఆమోదం తెలపగా, మంగళవారం వాటిని లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ అంశంపై కేంద్రం గుంభనంగా వ్యవహరిస్తున్నప్పటికీ, బిల్లును తీసుకురావటం ఖాయమని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. నేడు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నారని, అనంతరం దీనిని పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నట్టు తెలుస్తోంది.

ఆ జాబితాలో మాయం..
వాస్తవానికి రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత చట్టాలు (సవరణ బిల్లు) ను సోమవారం సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి. అయితే.. లోక్‌సభ కార్యదర్శి విడుదల చేసిన రివైజ్డ్‌ జాబితాలో సోమవారం ఈ రెండు బిల్లులకు సంబంధించిన అజెండాను పెట్టలేదు. దీంతో ఈ బిల్లులు నేడు సభ ముందుకు రాలేదు. దీంతో ఈసారికి ఈ బిల్లును ప్రభుత్వం వాయిదా వేసిందని అందరూ భావిస్తున్న వేళ.. అనూహ్యంగా ఈ బిల్లును నేడు సభ ముందుకు తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సంఖ్యాబలమే సమస్య
కాగా, లోక్ స‌భ‌లో ఈ బిల్లు పాస్ కావాలంటే మూడింట రెండు వంతుల సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంది. లోక్ స‌భలో 542 మంది సభ్యులుండగా, ఎన్డీఎ కూట‌మికి 293 మంది స‌భ్యులు, విప‌క్ష ఇండియా కూట‌మికి 235 మంది స‌భ్యులున్నారు. ఈ లెక్కన ఈ బిల్లు పాస్ కావాలంటే ఎన్డీఎ కూట‌మికి మ‌రో 68 మంది స‌భ్యుల ఓట్లు అవ‌స‌రం. ఈ నేపథ్యంలో పంతానికి పోతే.. బిల్లు తిరస్కారానికి గురవుతుందనే బెంగ పాలకపక్షానికి ఉంది. అందుకే.. దీనిని సభలో ప్రవేశపెట్టి, జేపీసీకి పంపితే తగిన సమయం దొరకుతుందని, ఈలోగా విపక్ష పార్టీలతో చర్చలు జరిపి, వారి మద్దతును సాధించవచ్చనే యోచనలో ప్రభుత్వం ఉంది. కాగా, ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వేళ.. సర్కారు ఈ బిల్లు విషయంలో ఎలా మందుకు పోతుందనే అంశం ఆసక్తి కరంగా మారింది.

తొలినాళ్లలోనే జమిలే.. .
వాస్తవానికి మనదేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే.. అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి.

Exit mobile version