Gold Rates Today Market Telugu States: ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బడ్జెట్‌కు ఒక రోజు ముందు.. జనవరి 31వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.84,700 వద్ద ట్రేడయ్యింది. అయితే, బడ్జెట్‌లో బంగారం మీద ఎలాంటి కొత్త నిర్ణయాలు ప్రకటించకపోవటంతో అంతర్జాతీయంగా విపరిణామాలు సంభవిస్తే తప్ప, ఈ ఏడాది మనదేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇతర దేశాల సంగతి పక్కనబెడితే, భారతీయ సంస్కృతి, జీవన విధానంలో దానికున్న ప్రత్యేకత, సామాజిక హోదాకు అది ప్రతీకగా ఉండటం, డబ్బు అవసరమైతే గంటల వ్యవధిలో నగదుగా మార్చుకునే వెసులు బాటు ఉండటంతో మనదేశంలో బంగారానికి ఎప్పటికీ గిరాకీ తగ్గదని కూడా నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ దీని వినియోగం నానాటికీ పెరగటం, ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా తవ్వి తీసే 3000 టన్నుల పుత్తడిలో పదోవంతు ఎలక్ర్టానిక్స్ పరికరాల్లో వినియోగిస్తుండటం, భారీగా ఎలక్ట్రానిక్ రంగం విస్తరించటంతో బంగారం ధరలు పెరగటమే తప్ప తగ్గటం ఉండదనేది మరో అంచనా.
బంగారం ధరలు డాలర్ ధరతో బాటు ఆయా దేశాల అంతర్గత మార్కెట్ల తీరును బట్టి మారుతుంటాయి. ఏ దేశంలోనైనా బంగారం నిల్వలు పెరుగుతూ ఉంటే.. ఆ దేశం ఆర్థికంగా బలపడినట్టే లెక్క. 1990-2000 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు(మన ఆర్బీఐ వంటివి) బంగారాన్ని విక్రయించేవి. అయితే, గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల దేశాల ఆర్థిక వ్యవస్థకు ఒత్తిళ్లకు లోనవటంతో గత 25 ఏళ్లుగా కేంద్రీయ బ్యాంకులు బంగారం అమ్మటం మానేసి,భారీగా బంగారాన్ని కొని నిల్వ చేయటం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కూడా పసిడి నిల్వలను నానాటికీ పెంచుకుంటూ వస్తోంది. జూలై 2019 నాటికి మన రిజర్వ్ బ్యాంక్ వద్ద 618.16 టన్నులు, జూలై 2022 నాటికి 768.8 టన్నుల బంగారం నిల్వలుండగా, 2024 నవంబర్ నాటికి ఆ మొత్తం 876 టన్నులకు చేరింది. 2024లో పోలెండ్ తర్వాత అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన కేంద్రీయ బ్యాంక్ మన ఆర్బీఐయేనని ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది. ప్రస్తుత లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారంలో ఐదో వంతు నిల్వలు ఆయా దేశాల కేంద్రీయ బ్యాంక్‌ల వద్దే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతపెద్ద మొత్తంలో బ్యాంకులు బంగారాన్ని నిల్వచేయటం ఇదే తొలిసారి.
ఇక.. ద్రవ్యసరఫరాకు ( కొత్తగా కరెన్సీని ముద్రించటానికి) ఆర్బీఐ పరిగణనలోకి తీసుకునే మూడు కీలక అంశాలలో ప్రభుత్వ సెక్యూరిటీలు, విదేశీ మారక నిల్వలతో బాటు బంగారం నిల్వలూ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువపై మన దేశంలో బంగారం, కరెన్సీ విలువ ఆధారపడి ఉంటాయి. మార్కెట్‌లో బంగారం ధర, అమెరికా డాలర్ మధ్య సంబంధం విలోమ – అనుపాతంలో ఉంటుంది. డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గటం, డాలర్ తగ్గితే బంగారం ధర పెరుగుతుంది.
ప్రపంచంలో బంగారం నిల్వలు అధికంగా ఉన్న దేశాలలో టాప్ 10 స్థానాల్లో వరుసగా అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, జపాన్, భారత్, నెదర్లాండ్స్, టర్కీ దేశాలున్నాయి. ఈ బంగారమంతా కడ్డీల రూపంలో ఉంది. 2024 సెప్టెంబరు లెక్కల ప్రకారం అమెరికా కేంద్ర బ్యాంకులో 8,133.46 టన్నుల బంగారం ఉండగా, జర్మనీ వద్ద 3315 టన్నులు, ఇటలీ చేతిలో 2415 టన్నులు, ఫ్రాన్స్ చెంత 2436 టన్నులు, రష్యాలో 2335 టన్నులు, చైనాలో 2264 టన్నులు, జపాన్‌లో 846 టన్నులు, భారత్‌లో 840 టన్నుల బంగారు నిల్వలున్నాయి. ఇది కేవలం ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల్లోని నిల్వ మాత్రమే. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం, ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదం, ఇరాన్, ఉత్తర కొరియాల అణుదాడి బెదిరింపులతో బాటు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల మూలంగా ఆర్థిక మాంద్యం వంటివి సంభవిస్తే.. ఈ నిల్వల సాయంతో ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయొచ్చనేది ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల వ్యూహంగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి 2,10,238 టన్నుల బంగారాన్ని వెలికి తీశారు. ఇందులో మూడింట రెండొంతుల మేర 1950 తర్వాత తవ్వి తీసిందే. పసిడి ఉత్పత్తిలో చైనాది అగ్రస్థానం. ఆ దేశంఏటా 370 టన్నుల బంగారాన్ని వెలికితీస్తోంది. ప్రపంచంలో మొత్తం తవ్వి తీసిన బంగారంలో సగం నగల రూపంలోకి, 22 శాతం కడ్డీలు, నాణేల రూపంలోకి మారుతోంది. ఇక.. ప్రపంచ జ్యూయలరీ మార్కెట్‌లో సగం వాటా కేవలం భారత్, చైనా దేశాలదే కావటం మరో విశేషం. మనదేశంలో ప్రజల వద్ద నగల రూపంలోనే ఏకంగా 25 వేల టన్నుల బంగారం ఉంటుందనేది ఒక అంచనా. ఇది ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11 శాతం కాగా, మన జీడీపీలో దాదాపు 40 శాతంగా ఉంది. ఈ మొత్తం 25 వేల టన్నుల బంగారంలో 40 శాతం బంగారం దక్షిణాది రాష్ట్రాల వారి వద్దనే ఉంది. మన దేశంలో పౌరుల వద్ద ఉన్న మొత్తం బంగారంలో 96 శాతం మహిళల వద్దే ఉంది. మనదేశంలో 1965లో పది గ్రాముల 24 కేరట్ల బంగారం ధర.. రూ. 71.75గా ఉండగా, 1970 నాటికి ఇది రూ.184.50కి, 1980 నాటికి రూ. 1330గా ఉంది. 1990లో ఇది రూ. 3200కి చేరగా, 2010 నాటికి రూ. 18,500కి చేరింది. మరో పదేళ్లకు(2020) నాటికి ఇది రూ. ఏకంగా 48, 651కి ఎగబాకగా, నేడు రూ. 84200కి చేరింది. ఈ లెక్కన రానున్న ఏడాది కాలంలోనే తులం బంగార రూ.లక్షకు చేరుతుందనేది మార్కెట్ నిపుణుల అంచనా.
బంగారానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన విశేషాలున్నాయి. బంగారు నిక్షేపాలకు దక్షిణాఫ్రికాలోని విట్‌వాటర్ శాండ్ బేసిన్ బాగా పేరుపొందింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 30% అక్కడిదే. వీటితో పాటు న్యూమోంట్ బాడింగ్టన్, సూపర్ పిట్(ఆస్ట్రేలియా), పొనెంగ్(దక్షిణాఫ్రికా), గ్రాస్బెర్గ్(ఇండొనేసియా) గనులు కూడా ప్రసిద్ధి చెందినవే. వీటితో బాటు అమెరికాలోని నెవాడాలోనూ చాలా బంగారు గనులున్నాయి. ఇక బంగారాన్ని ఎక్కువగా తవ్వితీసే దేశం చైనా. కెనడా, రష్యా, పెరూ దేశాలు కూడా ముందంజలో ఉన్నాయి. బంగారం అనే లోహం భూమిలో సహజసిద్ధంగా ఏర్పడిన లోహం కాదు. సుమారు 200 మిలియన్ ఏళ్ల నాడు భారీ ఉల్కలు భూమిని ఢీకొట్టటం వల్ల బంగారం అనే లోహం భూగర్భంలో ఏర్పడింది. సన్నగా, సాగే గుణం ఉండటమే బంగారానికి ఇంత విలువ తీసుకొచ్చింది. 28.3 గ్రాముల బంగారాన్ని సన్నటి తీగలా సాగదీస్తే 8 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిని 100 చదరపు అడుగుల రేకులా కూడా అణగగొట్టొచ్చు. మనిషికి పలు వస్తువుల మూలంగా ఏర్పడే ఫోబియాలలో బంగారం కూడా ఉంది. బంగారాన్ని చూసి భయపడటాన్ని ఆరో ఫోబియాగా వ్యవహరిస్తారు. మన సముద్రజలాల్లోనూ బోలెడంత బంగారం ఉన్నప్పటికీ దానిని లెక్కించటం సాధ్యం కాదు. ఉత్తర పసిఫిక్, అట్లాంటిక్ సముద్రజలాలలో ప్రతి 100 మిలియన్ మెట్రిక్ టన్నులకు ఒక గ్రాము బంగారం లభిస్తుందని ఓ అంచనా. ఇక సముద్రం అట్టడుగున కూడా పసిడి ఉంటుంది కానీ వెలికితీత చాలా కష్టం. అంతెందుకు.. మానవ శరీరంలోనూ బంగారం ఉంటుంది. 70 కిలోల సగటు బరువున్న మనిషిలో 0.2 మిల్లీ గ్రాముల బంగారం ఉంటుందని అంచనా. మంచి విద్యుత్తు వాహకమైనందున.. శరీరం అంతటికీ విద్యుత్తు సంకేతాలను పంపడంలో బంగారం ఉపయోగపడుతుంది.