Site icon Prime9

MA Baby : సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నిక

MA Baby

MA Baby

MA Baby : సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. ఆదివారం తమిళనాడు రాష్ట్రం మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభల్లో ఆయన్ను కొత్త సారథిగా ఎన్నుకున్నారు. గతేడాది సీతారాం ఏచూరి మృతి చెందగా, ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. దీంతో పార్టీ తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్‌ నేత ప్రకాశ్‌ కారాట్‌ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

 

 

85 మందితో కేంద్ర కమిటీ..
మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభలు నేటితో ముగిశాయి. మహాసభ 85మంది సభ్యులతో పార్టీ కేంద్ర కమిటీని ఎన్నుకుంది. నూతన కేంద్ర కమిటీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీని, 18 మందితో నూతన పొలిట్‌ బ్యూరోను ఎన్నుకుంది. కేంద్రకమిటీలో 20శాతం మంది మహిళలే ఉండటం విశేషం. సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి రేసులో సీనియర్‌ నేతలు ఎంఏ బేబీ, అశోక్‌ ధవలే, మహమ్మద్‌ సలీం, బీవీ రాఘవులు, బృందా కారాట్‌ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. పార్టీలో ఓ వర్గం ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) అధ్యక్షుడైన అశోక్‌ ధవలేకు మద్దతు ఇచ్చినట్లు సమాచారం.

 

 

ఎంఏ బేబీ నేపథ్యం..
1954లో కేరళలోని ప్రాక్కుళంలో పీఎం అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్ దంపతులకు ఎంఏ బేబీ జన్మించాడు. విద్యార్థి దశలో కేరళ విద్యార్థి ఫెడరేషన్‌ (ప్రస్తుతం ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరికతో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐల్లో పలు స్థాయిల్లో పోరాటాల్లో చురుగ్గా పనిచేశారు. 1986 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత కుందర నియోజకవర్గం నుంచి 2006 నుంచి 2016వరకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే 2006 నుంచి 2011వరకు కేరళ విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. 2012 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఎంఏ బేబీకి భార్య బెట్టీ లూయిస్‌, కొడుకు అశోక్‌ బెట్టీ నెల్సన్‌ ఉన్నారు.

 

 

Exit mobile version
Skip to toolbar