Site icon Prime9

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై వీడిన ఉత్కంఠ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే!

Eknath Shinde clears way for BJP CM in Maharashtra: తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదని.. బీజేపీ ఆ పోస్ట్ తీసుకున్నా పర్వాలేదని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు. మహా ముఖ్యమంత్రి పదవి విషయంలో కాస్త ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. షిండే సైతం సీఎం పోస్టును ఆశిస్తున్నారని.. అందుకే పీఠముడి పడిందన్న వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు షిండే స్పందించారు. తనకు ఆ పదవి మీద ఇంట్రెస్ట్ లేదని తేల్చేశారు. సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేసినా ఫర్వాలేదని ప్రకటించారు. తాను ఏనాడూ పేరు కోసం పాకులాడలేదని, బాల్‌ థాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానన్నారు. బుధవారం థానేలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మహరాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పారు. నాకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. సీఎం పదవిపై నాకు ఆశ లేదన్నారు. నా దృష్టిలో సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అన్నారు. అంతిమంగా మహారాష్ట్ర అభివృద్ధే నాకు ముఖ్యమని పేర్కొన్నారు. మహాయుతికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.

మహారాష్ట్ర సీఎం ఎంపిక మరింత ఆలస్యం?
మరోవైపు మహాయుతిలో ఏకాభిప్రాయం కుదరలేదని వస్తోన్న వార్తలపై ఫడణవీస్‌ కూడా స్పందించారు. సీఎం పదవిపై మహాయుతి కూటమిలో ఇంకా నిర్ణయం జరగలేదని, అయినప్పటికీ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఏక్‌నాథ్‌ శిండే, ఫడణవీస్‌, అజిత్‌పవార్‌లు ఢిల్లీకి రావాలని బీజేపీ అధిష్ఠానం నుంచి పిలుపువచ్చినట్లు సమాచారం. అమిత్‌ షాతో భేటీ అనంతరం సీఎం పదవి, ప్రభుత్వ ఏర్పాటుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెరపైకి శ్రీకాంత్‌ శిండే పేరు..
నూతనంగా ఏర్పడే మహాయుతి ప్రభుత్వంలో తన కుమారుడు శ్రీకాంత్‌ శిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఏక్‌నాథ్‌ శిండే పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్‌ ప్రస్తుతం కల్యాణ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నాడు. దీంతోపాటు తనకు మహాయుతి కూటమి కన్వీనర్‌ పదవి ఇవ్వాలని ఏక్‌నాథ్‌ శిండే డిమాండు చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం : ఎన్సీపీ ఎంపీ
మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనే అంశంపై రెండు మూడు రోజుల్లో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తుది నిర్ణయం తీసుకుంటారని ఎన్సీపీ నేత, రాయగఢ్‌ ఎంపీ సునీల్‌ తట్కరే అన్నారు. ఇంకా సీఎం ఎవరనే విషయంలో కొననసాగుతోన్న సస్పెన్స్‌పై ఆయన మాట్లాడారు. కొత్త సీఎంను నిర్ణయించడానికి రెండు, మూడు రోజులు సమయం పట్టొచ్చన్నారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీలు ‘మహాయుతి’ సంకీర్ణ కూటమి సీఎం పదవికి ఎలాంటి ఫార్ములా నిర్ణయించుకోలేదన్నారు.

అంగీకారానికి వస్తున్న శిందే వర్గం!
మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ తరుణంలో శివసేనకు చెందిన ఎంపీ నరేశ్‌ మహస్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌ను ‘మహాయుతి’ఎంపిక చేస్తే అంగీకరిస్తామన్నారు.

ఉద్ధవ్ ఠాక్రే మాదిరిగా వెళ్లిపోం..
‘మాకు సీఎం పదవి దక్కకపోతే.. మేం ఉద్ధవ్ ఠాక్రే మాదిరిగా వెళ్లిపోం. మహాయుతి తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తాం. దేవేంద్ర ఫడణవీస్‌ నాయకత్వంలో పనిచేస్తాం. ఏక్‌నాథ్ శిండే అసంతృప్తిగా లేరు’అని మహస్కే వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం పదవి దక్కని పక్షంలో.. హోంమంత్రి పదవి ఇవ్వాలని శిండే పట్టుబట్టినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వచ్చిన ఎంపీ స్పందన చూస్తుంటే.. ముఖ్యమంత్రి పదవిపై శిండే వర్గం పట్టుసడలిస్తున్నట్లు కనిపిస్తోంది.

Exit mobile version