Education and medical reforms are inevitable: ఒక దేశపు ప్రగతిని నిర్ణయించే కీలక రంగాలు అనేకం ఉన్నప్పటికీ వాటిలో విద్య, వైద్యం ప్రధానమైనవి. ఆర్థిక ప్రగతిలో వడివడిగా అడుగులు వేస్తోన్న మన దేశంలో.. ఈ రెండు రంగాలలో మాత్రం ఆశించిన స్థాయి ఫలితాలు కనిపించటం లేదు. ఈ రంగాలను సంస్కరించేందుకు పాలకులు దశాబ్దాలుగా కృషి చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయి ఫలితాలు మాత్రం రావటం లేదు. ఈ రెండు రంగాలలో మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులు అవసరముండటంతో పాలకుల ఆశయం బలంగా ఉన్నప్పటికీ లక్ష్యం దిశగా అడుగులు పడటం లేదు. గతంలో ప్రభుత్వాలు ఈ రెండు రంగాలకు పెట్టే ఖర్చును అనుత్పాదక వ్యయంగా భావించే రోజుల నుంచి.. ఈ రెండు రంగాలలో పరిస్థితులు మారినా, నేటికీ మన ప్రజలకు విద్య, వైద్యం అనేవి అందని ద్రాక్షలాగే మారుతున్నాయి.
మనదేశం… ఒకప్పుడు ప్రపంచ దేశాలకు విద్యాధామం. గణితం, ఖగోళం, ఆయుర్వేదం, తత్వశాస్త్రం, జ్యోతిషం, ఛందస్సు వంటి శాస్త్రాలకు కేంద్ర బిందువు. చైనా, ఇండోనేసియా, కొరియా, జపాన్, ఇరాన్, మయన్మార్, టర్కీ మొదలు రెండు డజన్ల దేశాల విద్యార్థులకు ఈ గడ్డ గమ్యస్థానం. అయితే, మనదేశం పరాయిపాలనకు చిక్కటంతో, ఈ వైభవం ఒక చరిత్రగా మిగిలిపోయింది. ఇక్కడి విద్యా విధానాన్నీ తమ మనుగడకు అనువుగా మార్చేసిన తెల్లదొరల నిర్వాకంతో మనది కాని ఆంగ్లాన్ని రుద్దారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో వారికింద పనిచేసే జీతగాళ్ల తయారీకి కావాల్సిన విద్యే అసలు.. విద్యగా చెలామణి అయింది. స్వాతంత్య్రానికి 120 ఏళ్ల ముందే ఆంగ్లేయ పాలకులు మద్రాసు, బొంబాయి, బెంగాల్ ఫ్రావిన్సులలో ఓ సర్వే చేశారు. ప్రాంతీయ భాషల్లోనే పాఠశాలలు నడుస్తున్నాయని.. కొన్నిచోట్ల ప్రతి వెయ్యి మందికి ఒకటి చొప్పున ఉన్నాయని.. నాణ్యమైన చదువు అందుతోందని తేల్చారు. ఐరోపా ఖండంలోని పాఠశాలలన్నీ కలిపినా భారత్‌లోని బడుల సంఖ్యకు సరిపోవని ఆ సర్వే నిర్ధారించింది. ఇంతటి పటిష్ఠమైన మన విద్యావ్యవస్థను బ్రిటిష్ అధికారి మెకాలే ఛిన్నాభిన్నం చేసి, మెడలు వంచే, మెదడుతో పనిలేని విద్యా విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టటంతో ఈ రంగపు రూపురేఖలు మారిపోయాయి.
ఈ చట్రంలో ఇరుక్కున్న విద్యారంగం.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నెమ్మదిగా మెరుగుపడినా, నేటికీ అంతర్జాతీయ ప్రమాణాలకు సుదూంగానే ఉంది. ఒకవైపు.. దేశంలోని 6 నుంచి 14 వయసు గల అందరికీ ఉచిత, నిర్బంధ విద్యను ఒక హక్కును భారత రాజ్యాంగం కల్పించినా, నేటికీ అది ఆచరణకు దూరంగానే ఉంది. నేటికీ మనదేశంలో విద్యా రంగంలో 70 శాతం బాధ్యతను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మోస్తుండగా, ఆ మిగిలిన వాటా ప్రైవేట్ రంగం చేతుల్లోనే ఉంది. మరోవైపు, మన ప్రభుత్వ విద్యాలయాలు జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగ గల నాణ్యమైన విద్యను కల్పించడంలో ఆశించిన స్థాయిలో రాణించటం లేదు. ఈ విద్యా విధానంలో థియరిటికల్ నాలెడ్జికి ఇచ్చే ప్రాధాన్యం, ప్రయోగాత్మక పరిజ్ఞానానికి దక్కకపోవటంతో మన విద్యార్థులు నాణ్యమైన మానవ వనరులుగా మారలేకపోతున్నారు. పుస్తకంలోని ప్రశ్నలు, జవాబులను బట్టీ పట్టడం, ర్యాంకులు సాధించటం తప్ప మన విద్యార్థులకు సృజనాత్మకమైన ఆలోచనలు, వ్యక్తిత్వ వికాసమనే అంశాల గురించి బొత్తిగా అవగాహన లేకుండా పోతోంది. మరోవైపు నార్వే ,స్వీడన్, ఫిన్లాండ్, కెనడా, అమెరికా దేశాలలో అంతరాలు లేని, ఒకే రకమైన విద్య అందుతోంది. అమెరికా 1 నుంచి12 వ తరగతి వరకు ప్రభుత్వమే ఉచిత, నాణ్యమైన విద్యను అందిస్తోంది. యూరప్ లాంటి దేశాల్లో పీజీ వరకూ విద్య ఉచితమే. కానీ మనదేశంలో, మన రాష్ట్రంలో నాణ్యమైన విద్య కావాలంటే ఎల్కేజీ నుంచే భారీగా ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి ఉంది. అమెరికా ఒక్కో విద్యార్థిపై ఏడాదికి పెట్టే ఖర్చు 12.17 లక్షలుగా ఉండగా, మనదేశంలో ఇది అందులో పదోవంతు కూడా లేదు. వాస్తవానికి మన ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రతిభ గల బోధకులు ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు కావాల్సి రావటం, పర్యవేక్షణా పరమైన లోపాల వల్ల మన ప్రభుత్వ విద్య రాణింపులోకి రావటం లేదు.
ఇక.. దేశంలోని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి, పెంపొందించడం రాజ్యపు ప్రధమ కర్తవ్యమని రాజ్యాంగంలోని 47వ అధికరణ నిర్దేశిస్తోంది. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. యూకే, అమెరికా, స్వీడన్, జపాన్ వంటివి ప్రజారోగ్యం కోసం తమ జీడీపీలో పదిశాతానికి పైగా నిధులను వెచ్చిస్తుండగా, నేటికీ మన జీడీపీలో ఆరోగ్య రంగానికి జరిగే కేటాయింపులు 2 శాతానికి లోపే ఉన్నాయి. మరోవైపు, అధిక జనాభా, మూఢ విశ్వాసాలు, నిరక్షరాస్యత, పేదరికం, భౌగోళిక స్వభావాలు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, ఔషధాల కొరత, ప్రైవేట్ ఆసుపత్రుల అనైతిక ధోరణి, అర్హత కలిగిన వైద్యుల కొరత లాంటి అనేక సవాళ్ళ నడుమ అందరికీ ఉచిత వైద్య సేవలు అందించటం మన ప్రభుత్వాలకు కష్టంగా మారుతోంది. మనదేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు ప్రజారోగ్య పథకాలను అమలుచేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా కేంద్రం, రాష్టాలు జాతీయ గ్రామీణ, పట్టణారోగ్య పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే, మన వైద్యరంగపు బలహీనతలను కొవిడ్ కాలం బయటపెట్టింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం వెయ్యి మంది జనాభాకి 3 ప్రభుత్వ ఆసుపత్రి పడకలు ఉండాలి. దీనిని ప్రేరణగా తీసుకుని భారత ప్రభుత్వం ఏడేళ్ల కిందట తీసుకొచ్చిన జాతీయ ఆరోగ్య విధానం(ఎన్‌హెచ్‌పీ).. ప్రతి వెయ్యి మందికి కనీసం 2 ఆసుపత్రి పడకలను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించుకుంది. అయితే, నేటీకి మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అన్నింటినీ కలిపినా సగటున 1.3 పడకలే ఉన్నాయని అంతర్జాతీయ కన్సల్టెన్సీ ‘నైట్‌ఫ్రాంక్’నిరుటి నివేదిక వెల్లడించింది. అలాగే, ఐక్యరాజ్య సమితి సిఫార్సుల ప్రకారం ప్రతి 1000 జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. తాజా వివరాల ప్రకారం మనదేశంలో 1404 మందికి ఒక అల్లోపతి డాక్టర్ మాత్రమే ఉన్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ప్రతి జిల్లా కేంద్రానికి ఒక వైద్య కళాశాలను ఏర్పాటుచేయాలని కేంద్రం ప్రయత్నించటం అభినందనీయమే. మనదేశంలో మొత్తం 706 మెడికల్ కాలేజీలుండగా, అందులో 386 ప్రభుత్వ కళాశాలలు, 320 ప్రైవేటు మెడికల్ కాలేజీలు. ఏటా 24 లక్షల మంది నీట్ పరీక్ష రాస్తుండగా, వీటిలో లక్షకు పైగా ఎంబీబీఎస్ సీట్లుండగా, అందులో సగం ప్రైవేటు కాలేజీల్లో ఉండటంతో కోట్లు పోసి వాటిని కొనక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో కోట్లు పోసి ప్రైవేటు ఆసుపత్రులు పెట్టిన వారు సేవాభావంతో వైద్యం చేస్తారని ఆశించటం దురాశే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఇప్పటి విద్య, వైద్య విధానాలను సమగ్రంగా పున:సమీక్షించుకొని, అవసరమైన సంస్కరణలు ప్రవేశపెట్టి, వాటిని గట్టిగా అమలు చేస్తేనే దేశం బహుముఖంగా ప్రగతి సాధించగలుగుతుంది.