Earthquake of magnitude 5 strikes Assam: అస్సాం రాష్ట్రంలో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2.25 నిమిషాలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం రావడంతో ఇళ్లల్లోని వస్తువులు కదిలాయి. ఒక్కసారిగా ఇంట్లో వస్తువులు కదలినట్లు శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు తెలియరాలేదు. మోరిగావ్ కేంద్రంగా సుమారు 91 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని, పట్టణానికి వాయువ్యంగా 18.7 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
అలాగే, బంగ్లాదేశ్, భూటాన్, చైనాతో పాటు పక్కన ఉన్న దేశాలలో భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, అస్సాంలో భూకంపం రావడం సహజమేనని, దేశంలో అత్యధిక భూకంపాలు వచ్చే జోన్‌లలో ఈ ప్రాంతం కూడా ఒకటని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇండోనేషియాలో ఫిబ్రవరి 26వ తేదీన మరోసారి భూమి కంపించింది. ఉత్తర సులవేసి ప్రావిన్స్ ఆఫ్ షోర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతగా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.