DK Shivakumar : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే డీకే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఉహగానాలు వెల్లువెత్తగా, వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
అందుకే ఖర్గేను కలిశా : డీకే
మల్లికార్జున ఖర్గేతో తన సమావేశం ప్రోటోకాల్‌కు సంబంధించిన అంశమని డీకే శివకుమార్ తెలిపారు. ఖర్గే తమ పార్టీ అధ్యక్షుడు అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం తాను రిసీవ్ చేసుకోవాల్సి ఉందని, అందుకే ఖర్గేను కలిసినట్లు చెప్పారు. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం శంకుస్థాపన కోసం ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఖర్గేతో అనేక విషయాలు చర్చించినట్లు వెల్లడించారు.
కొన్ని రోజుల నుంచి ఊహాగానాలు
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరిస్తారంటూ కొన్నిరోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు డీకే పార్టీ మారనున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే ముఖ్యమంత్రి కావడం ఖాయమని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. డీకే ముఖ్యమంత్రి పదవి చేపట్టడం అనేది కాలపరిమితితో కూడుకున్నదని, అయితే అది కచ్చితంగా జరగుతుందని చెప్పారు.
వీరప్ప మొయిలీ వ్యాఖ్యలపై..
వీరప్ప మొయిలీ వ్యాఖ్యలపై సహాయక మంత్రి కేఎన్ రాజన్న స్పందించారు. ఇది కేవలం మొయిలీ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని చెప్పారు. దీన్నిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇదే విషయంపై డీకే శివకుమార్ మాట్లాడారు. ఈ ప్రకటన వీరప్ప వ్యక్తిగతమని, ఖర్గే నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అయినప్పటికీ వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మల్లికార్జున ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ కావడంతో ఉహాగానాలు మరింత జోరందుకున్నాయి. త్వరలో డీకే ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోవడం ఖాయమంటూ ప్రచారం కొనసాగుతోంది.