Site icon Prime9

Arvind Kejriwal: త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎలాంటి పొత్తులు లేకుండానే పోటీ

Arvind Kejriwal’s big announcement ahead of Delhi Assembly elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్‌ పెడుతున్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక ప్రకటక చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎలాంటి పొత్తులు లేకుండానే పోటీ చేస్తామని ప్రకటించారు. ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

ఇండియా కూటమితో పొత్తుండదు..
ఆదివారం ఢిల్లీలో మాజీ సీఎం కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. ఎన్నికల కోసం ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ఇండియా కూటమితో పొత్తుకు మేము సిద్ధంగా లేమంటూ కుండబద్దలు కొట్టారు. ఢిల్లీలో శాంతిభద్రతల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తాను చేసిన తప్పు ఏంటి అన్నారు. ఢిల్లీ శాంతిభద్రతల విషయంలో కేంద్రమంత్రి అమిత్‌ షా చర్యలు తీసుకుంటారని ఆశించానని, కానీ పాదయాత్రలో తనపై దాడి జరిగిందన్నారు. తాము ప్రజా సమస్యలను లేవనెత్తామని, వీలైతే గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేయించాలన్నారు. కానీ, మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కూడా పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఆప్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే. 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. మరోవైపు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా పొత్తు లేకుండానే పోటీ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్‌ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో, ఇండియా కూటమి నేతలు, బీజేపీ మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.

ఇప్పటికే ఆప్ తొలి జాబితా…
ఆమ్‌ ఆద్మీ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఎన్నికల కోసం 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఛత్తర్‌పూర్ నుంచి బ్రహ్మ సింగ్ తన్వార్, కిరాడి నుంచి అనిల్ ఝా, విశ్వాస్ నగర్ నుంచి దీపక్ సింగ్లా, రోహతాన్ నగర్ నుంచి సరితా సింగ్, లక్ష్మీ నగర్ నుంచి బీబీ త్యాగి, బదార్‌పూర్ నుంచి రామ్ సింగ్, సీలమ్‌పూర్ నుంచి జుబీర్ చౌధురి, సీమాపురి నుంచి వీర్ సింగ్ ధిగాన్, ఘోండా నుంచి గౌరవ్ శర్మ, కర్వాల్ నగర్ నుంచి మనోజ్ త్యాగి, మాటియాలాలో సోమేశ్ షౌకీన్‌ పేర్లను కేజ్రీవాల్ ప్రకటించారు.

బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్‌ గహ్లోత్‌..
ఆమ్‌ ఆద్మీ పార్టీకి కైలాష్‌ గహ్లోత్‌ చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, జే పాండా, దుష్యంత్ గౌతమ్, హర్ష్ మల్హోత్రా, పలువురు బీజేపీ నేతల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆప్‌ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఢిల్లీ రవాణాశాఖ మంత్రి పదవికి కూడా గహ్లోత్‌ రాజీనామా చేసిన సంగతి విదితమే.

Exit mobile version