Arvind Kejriwal in the lead in Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా సాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి భారీ ఆధిక్యంలో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. తొలుత 43 స్థానాల్లో ఉన్న బీజేపీ.. 39 స్థానాలకు పడిపోయింది. కానీ ఆప్ 19 స్థానాల్లో ఆధిక్యం నుంచి 30 స్థానాలకు పెరిగింది. మరోవైపు, వెనుకంజలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆధిక్యంలోకి వచ్చారు.
బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉన్న ఆప్ మళ్లీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ప్రస్తుతం బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతుండగా.. కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. అయితే, ఇప్పటివరకు కొనసాగుతున్న కౌంటింగ్ విషయానికొస్తే ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులకు సమీప ప్రత్యర్థులకు మధ్య 500 నుంచి 1000లోపు ఓట్ల తేడా మాత్రమే ఉంది. దీంతో ప్రతీ రౌండ్ ప్రాముఖ్యత సాధించుకుంది.
అలాగే, కౌంటింగ్ ప్రారంభం నుంచి వెనుకంజలో ఉన్న ఆప్ అభ్యర్థులు సైతం ఆధిక్యంలోకి వచ్చారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి 343 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. గాంధీ నగర్ లో బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీపై ఆప్ అభ్యర్థి నవీన్ చౌదరి 5వేల ఓట్ల ఆధిక్యం సాధించారు.