Site icon Prime9

G20 Summit: భారత్, చైనా మంత్రుల కీలక భేటీ.. చర్చించిన విషయాలివే!

A Foreign Ministers’ Meet On G20 Sidelines: బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో కేంద్రమంత్రి జైశంకర్‌ భేటీ భైటీ అయ్యారు. ఈ మేరకు భారత్, చైనా సంబంధాల బలోపేతంపై సమావేశమయ్యారు. ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాలు మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చర్చించారు.

చైనా, భారత్ దేశాల సరిహద్దు ప్రాంతాల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న బలగాల విషయంపై ఇటీవల చోటుచేసుకున్న పరిస్థితులపై కేంద్ర మంత్రి జైశంకర్ మాట్లాడారు. వాస్తవాధీన రేఖ బలగాల ఉపసంహరణలో పురోగతి సాధించినట్లు వెల్లడించారు. ఈ విషయం స్వాగతిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు ఊతం లభించినట్లు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలతో పాటు తదుపరి కార్యచరణపై చర్చించినట్లు జైశంకర్ వెల్లడించారు. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులపై చర్చించినట్లు చెప్పారు. ఈ సమావేశం ద్వారా ప్రపంచ రాజకీయాల్లో ఇరుదేశాల ప్రాముఖ్యతను గుర్తుచేసిందని చెప్పుకొచ్చారు.

‘జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా సీపీసీ పొలిట్ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో సమావేశమయ్యాం. చైనా, భారత్ దేశాల సరిహద్దు విషయంలో ఓ కొలిక్కి వచ్చింది. దీంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల పరిస్థితులపై చర్చించాం.’ అంటూ కేంద్ర మంత్రి జై శంకర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

కాగా, అంతకుముందు ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణకు చెందిన ఓ కర్నల్ సంతోష్ బాబుతో పాటు 20మందికిపైగా సైనికులు వీరమరణం చెందారు. ఈ ఘటనలో చైనా సైతం తమ సైనికులను కోల్పోయింది. అయితే అప్పటినుంచి ఇరు దేశాల మధ్య వాగ్వాదం పెరుగుతూ వస్తుంది. ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరు దేశాల మధ్య ఒప్పందం సైతం కుదుర్చున్న సంగతి తెలిసిందే.

Exit mobile version