Site icon Prime9

MahaKumbh Mela 2025: వైభవంగా ముగిసిన మహాకుంభమేళా..మళ్లీ 144 ఏళ్లకే ఈ భాగ్యం

45 days of Maha Kumbh Mela concludes: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గత 45 రోజులుగా జరుగుతున్న మహాకుంభమేళా బుదవారంతో ప్రశాంతంగా ముగిసింది. జనవరి 13న పుష్య పౌర్ణమి ఘడియల్లో ప్రారంభమైన ఈ అరుదైన ఆధ్యాత్మిక వేడుక.. మాఘ అమావాస్య నాటి మహాశివరాత్రితో ముగిసింది. ఈ నెలన్నర కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి 63 కోట్లకు పైగా భక్తులు ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పావన త్రివేణీ సంగమంలో స్నానమాచరించి కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకున్నారు.

144 ఏళ్లకోసారి వేడుక..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్‌‌లో 12 సంవత్సారలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. కాగా, ప్రతీ 144 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా మాత్రం ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహించడం విశేషం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మహా కుంభమేళా మొదలవుతుంది. ఈ 45 రోజులలో వచ్చిన పుష్య పౌర్ణమి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పూర్ణిమ, మహా శివరాత్రి పర్వదినాల్లో కోట్లాదిమంది ఇక్కడ పుణ్యస్నానాలు చేశారు.

ఘనంగా ముగింపు వేడుక..
బుధవారం మహాశివరాత్రి రోజు ఏడు శైవ అఖాడాలకు చెందిన సాధువులు పేష్వై ఊరేగింపుల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశాక.. మహాకుంభమేళా ముగిసినట్లు ప్రకటించారు. ఈ పేష్వై ఊరేగింపులో 10,000 మందికి పైగా నాగ సాధువులు కాశీ రోడ్ల గుండా తమ దేవతలు, జెండాలతో, త్రిశూలాలు, కత్తులు, గదలను ప్రదర్శిస్తూ ‘హర్ హర్ మహాదేవ్’ నినాదాల మధ్య పాడుతూ, నృత్యం చేస్తూ ప్రదర్శన చేశారు. ఆ సమయంలో యూపీ సర్కారు వారిపై పూలవర్షం కురిపించింది. ఒక్క బుధవారం రోజే 1.35 కోట్లమంది భక్తులు సంగమస్నానం చేశారు.

రికార్డు లెక్కలు..
ఈ 45 రోజులలో త్రివేణీ సంగమంలో దాదాపు 70 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా, గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ డ్రైవ్‌ను చేపట్టారు. ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి యూపీ ప్రభుత్వం రూ.2100కోట్ల స్పెషల్‌ గ్రాంట్‌ మంజూరు చేయగా, మొత్తంగా ఇక్కడ ఈ 45 రోజుల్లో రూ. 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు సీఏఐటీ వర్గాలు తెలిపాయి. ఈ వేడుక కోసం 37వేల మంది పోలీసులు, 14 వేల మంది హోంగార్డులు భద్రతా విధులు నిర్వహించగా, 2750 ఏఐ సీసీటీవీలు, 3 జల్‌ పోలీస్‌స్టేషన్లు, 18 జల్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లు, 50 వాచ్‌టవర్లను ఏర్పరచారు. యాంటీడ్రోన్‌ వ్యవస్థ, ఏఐ ఆధారిత కెమెరాలతో పాటు 40 హెక్టార్ల విస్తీర్ణంలో మహాకుంభ్‌ నగర్‌ పేరుతో తాత్కాలికంగా ఓ జిల్లానే ఏర్పాటు చేశారు.

అయోధ్యకు భక్తజనం
గడిచిన 52 రోజుల్లో సుమారు 17 కోట్ల మంది భక్తులు అయోధ్య రామాలయాన్ని దర్శించుకున్నారని సీఎం యోగి ఆదిత్యానాథ్ వెల్లడించారు. మక్కాకు ఏడాదికి 1.4 కోట్ల మంది, వాటికన్‌సిటీకి 80 లక్షల మంది సందర్శిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భక్తులు తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు రైల్వే శాఖ.. మహాశివరాత్రి సందర్బంగా ప్రయాగ్‌రాజ్ నుండి 350కి పైగా స్పెషల్ రైళ్లను నడిపింది.

Exit mobile version
Skip to toolbar