Prime9

Sikkim landslide: మిలటరీ క్యాంపుపై విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు సిబ్బంది మృతి

3 dead in Sikkim landslide: సిక్కింలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర సిక్కింలోని చట్టేన్ సమీపంలో మిలటరీ శిబిరంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఆరుగురు భద్రతా సిబ్బంది ఆచూకీ కనిపించడం లేదని అధికారులు తెలిపారు.

 

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆదివారం రాత్రి 7 గంటలకు కొండచరియలు విరిగిపడినట్లు రక్షణశాఖ అధికారులు ధృవీకరించారు. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలు గుర్తించగా.. మరో నలుగురు ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిపారు. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

 

ఇదిలా ఉండగా, లాచెన్ నదిలో నీటి మట్టం విపరీతంగా పెరిగింది. ఈ సమయంలోనే కొండచరియలు విరిగిపడినట్లు మంగన్ జిల్లాలోని చుంగ్‌తాంగ్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అరుణ్ థాటల్ చెప్పారు. అంతకుముందు తీస్తా నదిలో ఓ వాహనం పడిపోవడంతో కొంతమంది పర్యాటకులు మృతిచెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో వారం రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడొచ్చని చెప్పింది. ప్రధానంగా అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది.

Exit mobile version
Skip to toolbar