20 people dead after consuming spurious liquor in Bihar: బీహార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 25 మంది మృత్యువాత పడగా.. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన సివాన్, సారన్ జిల్లాలోని ముష్రఖ్ పోలీస్ స్టేషన్ పరధిలోని ఇబ్రహీంపూర్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. బీహార్‌లోని సివాన్, సారన్ జిల్లాలోని చెందిన పలువురు మద్యం తాగారు. అయితే కల్తీ మద్యం కావడంతో కొంతమంది అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించగా.. 25 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. మరికొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్పీ శివన్ అమితేశ్ కుమార్ వెల్లడించారు.
మఘర్, ఔరియా పంచాయతీలో బుధవారం ఉదయం ముగ్గురు అనుమానస్పదంగా మృతి చెందడంతోపాటు కొంతమంది పరిస్థితి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని అనారోగ్యంతో ఉన్న 12 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యలో ఓ వ్యక్తి మరణించాడు. అయితే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
ఇప్పటివరకు సివాన్‌లో 20 మంది, ఛప్రా జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. అయితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఇక, మష్రక్ ప్రాంతంలో మృతి చెందిన వారిలో బ్రహింపూర్‌కు చెందిన ఇష్లాముద్దీన్, శంసాద్, గండమాన్‌కు చెందిన కమలేష్ రాయ్, సుందర్ గావ్‌కు చెందిన గుల్ మహమ్మద్, మధురాకు చెందిన చక్దారాకు చెందిన మహ్మద్ ఉన్నారు.
ఛప్రాలో కల్తీ మద్యం కుంభకోణంలో వాచ్ మెన్‌తో పాటు పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు మష్రక్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్, ఏఎల్‌టీఎప్ ఇన్‌ఛార్జ్‌లకు ఎస్పీ నోటీసులు జారీ చేశారు. మరోవైపు పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇప్పటికే 100 లీటర్ల మద్యాన్ని బనియాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకోగా.. దొరిగంజ్ పోలీసులు 300 లీటర్ల దేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతులతోపాటు చికిత్స పొందుతున్న బాధితుల వివరాలను అధికారులు వెల్లడించలేదు.