Luxury Home Sales:దేశ ప్రజల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలపడే కొద్ది ప్రజలు లగ్జరీ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఐదవ స్థానంలో నిలిచింది. ఆర్థిక వ్యవస్థ బలపడినప్పుడు దేశ ప్రజల చేతిలో పెద్ద ఎత్తున డబ్బు అడుతున్నట్లు లెక్క. సంపన్నదేశాల్లో లభించే కార్లు కూడా మన దేశంలో లభిస్తున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌లాంటి మహానగరంలో లగ్జరీ హౌసెస్ ఎక్కడో ఉండేవి. ప్రస్తుతం నగరం చుట్టు ఎక్కడ చూసినా అంతా లగ్జరీ హోమ్స్ నిర్మాణాలు చకచకా జరుగుతున్నాయి. అయితే తాజాగా రియల్ ఎస్టేట్ కన్సెల్టెంట్ అనెరాక్ గ్రూపు విడుదల చేసిన నివేదికలో లగ్జరీ హోం సేల్స్ గణనీయంగా పెరిగిపోయినట్లు తెలిపింది. సంప్నవర్గాలతో పాటు ప్రవాస భారతీయులు లగ్జరీ హోమ్స్‌ను పెద్ద ఎత్తున కొనుగోలుకు మొగ్గచూపుతున్నారు. అదే సమయంలో చౌకధరల అమ్మకాలు మాత్రం గణనీయంగా తగ్గిపోయాయి. మిడ్‌రేంజ్ హౌసింగ్ మాత్రం యధాతథంగా మంచి డిమాండ్‌తో కొనసాగుతోంది.
గత ఐదేళ్ల నుంచి చూస్తే లగ్జరీ హోమ్ సేల్స్ మూడు రెట్లు పెరిగాయని కన్సెల్టెంట్ గ్రూపు అనెరాక్ వెల్లడించింది. రూ.1.50 కోట్లు అంత కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్లను లగ్జరీ హోమ్ కేటగిరి కిందికి వస్తుంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అంటే జనవరి నుంచి మార్చి చివరి నాటికి చూస్తే మనదేశంలో ఏడు నగరాల్లో లగ్జరీ హోమ్ సేల్స్ 21 శాతం పెరిగాయని శుక్రవారం నాడు విడుదల చేసిన తాజా నివేదికలో వివరించింది. 2019లో ఇవే లగ్జరీ హోమ్స్ కేవలం 7 శాతం మాత్రమే ఆక్రమించాయి. ఈ ఏడాది ప్రారంభంలో డీఎల్‌ఎఫ్ లిమిటెడ్ దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో 1,100 లగ్జరీ హోమ్స్ నిర్మిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటనలు విడుదల చేయగానే మూడు రోజుల్లో బుకింగ్ పూర్తయింది. అప్పటికి నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. చాలా మటుకు లగ్జరీ హోమ్స్ కొనుగోలు చేసింది మాత్రం ప్రవాస భారతీయులేనని తేలింది.
అందుబాటు ధరల్లో లభించే గృహాల అమ్మకలు మాత్రం ఈ ఐదేళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. దేశంలోని మొత్తం అమ్మకాల్లో 37 శాతం నుంచి 18 శాతానికి దిగివచ్చాయి. అయితే మిడ్‌రేంజ్, ప్రీమియం హౌసింగ్ సెగ్మెంట్ హోమ్స్ వాటా మాత్రం బాగా పుంజుకుని 59 శాతానికి చేరింది. ఇక వీటి ధర విషయానికి వస్తే రూ.40 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది. ఇక లగ్జరీ హోమ్స్ విషయానికి వస్తే పెద్ద పెద్ద గృహాలు… బ్రాండెడ్ డెలపర్లచే మంచి లోకేషన్లలో నిర్మించేవని అనెరాక్ చైర్మన్ అనుజు పూరి నివేదికలో వివరించారు. ఇక చౌక గృహాల అమ్మకాలు మాత్రం 2019 నుంచి క్రమంగా తగ్గముఖం పడుతూ వచ్చాయి. గత ఐదేళ్ల డేటాను చూస్తే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను చూస్తే 25 శాతం లగ్జరీ హోమ్స్ ఉన్నాయి. అదే సమయంలో చౌకరకం ఇళ్ల నిర్మాణం విషయానికి వస్తే 2019లో 40 శాతం వాటా ఉంటే ప్రస్తుతం 18 శాతానికి దిగివచ్చింది. ప్రజల అభిరుచుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోందని పూరి చెప్పారు.