Go First Airlines: విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, నరేష్ గోయల్‌కు చెందిన జెట్ ఎయిర్‌వేస్ బాటలోనే మరో ఎయిర్‌లైన్ దివాలా తీయడానికి సిద్దంగా ఉంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రిటానియా బిస్కెట్ సీఎండీ నుస్లీ వాడియాకు చెందిన గో ఫస్ట్ కూడా రేపో మాపో చేతులు ఎత్తేసే పనిలో ఉంది. ఈ నెల 3, 4 తేదీల్లో అన్నీ ఫ్లయిట్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.గో ఫస్ట్ ఎయిర్‌వేస్‌కు నగదు కటకట ఏర్పడింది. దీనితో యాజమాన్యం అదనంగా నిధులు సమకూర్చడానికి వెనుకంజ వేస్తోంది. దీంతో ఈ నెల 3, 4వ తేదీల్లో అన్నీ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
నిరుపయోగంగా 28 విమానాలు..( Go First Airlines)
ఈ పరిస్దితుల్లో యాజమాన్యం స్వచ్చందంగానే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి దివాలా ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌశిఖ్ ఖోనా పిటిఐ వార్త సంస్థకు తెలిపారు. దురదృష్టమైన నిర్ణయం. అయినా కంపెనీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎన్‌సీఎల్‌టిని ఆశ్రయించాల్సి వచ్చిందని కౌశిఖ్ అన్నారు. కాగా గో ఫస్ట్‌కు ఆర్థిక ఇబ్బందులు తెలెత్తాయని ఆయన అన్నారు. దీంతో పాటు ప్రాట్ అండ్ వైట్నీ ఇంజిన్‌లు సరఫరా చేయకపోవడంతో మొత్తం 28 విమానాలు బలవంతంగా నిరుపయోగంగా ఎయిర్‌పోర్టుల్లో అలా ఉంచాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
చమురు కంపెనీలకు బకాయిలు..
ఇదిలా ఉండగా గో ఫస్ట్‌లో సుమారు 3,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా పౌరవిమానయాన డైరెక్టర్ జనరల్‌కు సమాచారం అందించడం జరిగిందని ఖోనా చెప్పారు. కాగా మంగళవారం నాడు గో ఫస్ట్ తమ సర్వీసులను నిలిపివేయడానికి గల కారణాలను ఓ ప్రకటనలో వివరించింది. అమెరికాకు చెందిన ప్రాట్ అండ్ వైట్నీ సరఫరా చేసిన ఇంజిన్లు విఫలం కావడంతో మే 1 నుంచి 25 విమానాలు సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఇక గో ఫస్ట్ ఆపరేషన్ విషయానికి వస్తే క్యాష్ అండ్ క్యారీ మోడల్‌లో పనిచేస్తోంది. దీని అర్థం ఏమిటంటే ఆయిల్ కంపెనీలకు విమానంలో ఇంధనం నింపిన తర్వాత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఒక వైపు నడపాలంటే విమానాలు లేక మరో వైపు చేతిలో నిధులు లేక చమురు కంపెనీలకు కూడా బకాయిలు పడిందని తెలిపింది.
కాగా ప్రాట్ అండ్ వైట్నీ విమానాలకు కావాల్సిన విడిభాగాలను సరఫరా చేయడం లేదు. ఇంజిన్లు సర్వీసు చేయడం లేదని గోఫస్ట్ పేర్కొంది. 2022 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లోచిక్కుకుంది. నిధులు సేకరించడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడింది. ఇదిలా ఉండగా గత నెల రాయిటర్స్ వార్తా సంస్థ గో ఫస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడించింది. వాడియా గ్రూపు యజమాని గో ఫస్ట్ కోసం కొత్త భాగస్వామిని అన్వేషిస్తున్నారని.. లేదా తన వాటాను విక్రయించి కంపెనీ నుంచి నిష్ర్కమించాలనుకుంటున్నట్లు తెలిపింది. అటు తర్వాత వాడియా గ్రూపు ఇవన్నీ వట్టి పుకార్లే అని తేల్చేసింది. కంపెనీ యాజమాన్యం ఎయిర్‌లైన్స్ వ్యాపారం నుంచి తప్పుకోదని.. కావాలనుకుంటే అదనపు నిధులను సమకూరుస్తుందని ఎయిర్ లైన్ సీనియర్ అధికారి అప్పుడువివరించారు.
ఇకపై పెట్టుబడులు పెట్టలేం..
ఇదిలా ఉండగా గత 36 నెలల నుంచి 3,200 కోట్లు పెట్టుబడులు పెట్టామని వాడియా గ్రూపు వెల్లడించింది. గత 24 నెలల నుంచి 2,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టామని.. ఏప్రిల్ నెలలోనే 290 కోట్ల వ్యయం చేశామని యాజమాన్యం పేర్కొంది. ఇక తాము పెట్టుబడులు పెట్టలేమని తేల్చేసింది. పీఅండ్ డబ్యు నుంచి తమకు విడిభాగాలు వచ్చి అన్నీ సవ్యంగా జరిగితేనే తిరిగి సర్వీసులను నిడిపే ఆలోచన చేస్తామని ప్రకటించింది గో ఎయిర్. ఇక గో ఫస్ట్ అమెరికా తయారీ కంపెనీ ప్రాట్ అండ్ వైట్నీపై యూఎస్ ఫెడరల్ కోర్టులో కేసు వేసింది. తమకు విడిభాగాలు సరఫరా చేయడం లేదని ఆరోపించింది. ఇదిలా ఉండగా గో ఫస్ట్ మార్కెట్ వాటా క్రమంగా తగ్గిపోతోంది. జనవరిలో 8.4 శాతం వాటా నుంచి మార్చి నాటికి 6.9 శాతానికి దిగివచ్చిందని డీజీసీఏ ప్రకటించింది.