Site icon Prime9

High Court : వేములవాడ మాజీ ఎమ్మెల్యేకు బిగ్‌షాక్.. చెన్నమనేని భారత పౌరుడు కాదు : తెలంగాణ హైకోర్టు

High Court

High Court

High Court : వేములవాడ బీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై గతంలో ఇచ్చిన తీర్పుపై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని భారత పౌరుడు కాదని, జర్మనీ పౌరుడని ధర్మాసనం తేల్చి చెప్పింది. తప్పుడు పత్రాలతో అధికారులు, న్యాయస్థానాలను 15 ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. చెన్నమనేని కోర్టు ఖర్చుల కింద రూ.30 లక్షలు పిటిషనర్‌కు చెల్లించాలని గతంలో న్యాయస్థానం తీర్పునిచ్చింది. రూ.30లక్షల్లో పిటిషనర్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీకి రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. చెన్నమనేని భారత పౌరుడు కాదని 15 ఏళ్లుగా ఆది శ్రీనివాస్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో న్యాయస్థానం తీర్పుపై అప్పీల్ చేయకుండా చేసిన తప్పును ఒప్పుకుని కోర్టు ఖర్చుల కింద చెన్నమనేని రూ.30లక్షలు చెల్లించారు. దీంతో సోమవారం హైకోర్టు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ ముందు రూ.25 లక్షలు పిటిషనర్ ఆది శ్రీనివాస్‌కు చెన్నమనేని తరఫు న్యాయవాది డీడీ అందించారు.

 

15 ఏళ్ల నుంచి న్యాయ పోరాటం..
ఈ సందర్భంగా పిటిషనర్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. చెన్నమనేని భారత పౌరుడు కాదని 15 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు. హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేయకుండా తప్పు ఒప్పుకున్నారని చెప్పారు. కోర్టు ఖర్చుల కింద రూ.30లక్షలు చెన్నమనేని చెల్లించారని తెలిపారు. ఇవాళ హైకోర్టు జస్టిస్ విజయ్ సేన్‌రెడ్డి బెంచ్ ముందు రూ.25లక్షలు తనకు డీడీ రూపంలో చెన్నమనేని తరఫు న్యాయవాది అందించినట్లు చెప్పారు. మరో రూ.ఐదు లక్షలు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించారన్నారు.

 

వేములవాడ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..
చెన్నమనేని వేములవాడ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆది శ్రీనివాస్ కోరారు. ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పారు. వేములవాడ నియోజకవర్గం చెన్నమనేని రమేశ్ వల్లే అభివృద్ధి చెందలేకపోయిందని విమర్శించారు. అక్రమంగా ప్రభుత్వం నుంచి తీసుకున్న జీతభత్యాలపై జర్మనీ, భారత హోం శాఖలకు ఫిర్యాదు చేస్తానన్నారు. దేశంలో ఇలాంటి నేత బహుశా ఎవరూ లేరని ఫైర్ అయ్యారు. భారత పౌరసత్వం లేకపోయినా ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారని తెలిపారు. చెన్నమనేని తీసుకున్న ప్రభుత్వ జీతభత్యాలపై త్వరలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఇప్పటికైనా చెన్నమనేని రమేశ్ తన తప్పును ఒప్పుకుని ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

 

 

Exit mobile version
Skip to toolbar