Strike Siren From Feb 9 in Telangana TGRTC Bus services bandh: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందు తమ డిమాండ్లను ఉంచింది. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రెండు పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ నగదు రూ.2,700 కోట్ల చెల్లింపు వంటి డిమాండ్లను ఉంచింది. ఈ డిమాండ్లను నెరవేర్చని యెడల ఫిబ్రవరి 9వ తేదీన సమ్మె చేయనున్నట్లు నోటీసుల్లో వివరించారు.
అద్దె బస్సులతో నష్టం..
ప్రభుత్వం అద్దెకు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తే డ్రైవర్లు ఉపాధి కోల్పోవటం ఖాయమని, దానికి బదులు ప్రభుత్వమే ఆ బస్సులు కొని ఇప్పుడున్న డైవర్లకు అవకాశం కల్పించాలని జేఏసీ నేతలు తమ నోటీసులో కోరారు. అద్దె బస్సులకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ప్రైవేటు వ్యక్తులకే చెందుతుంది తప్ప దాని వల్ల ప్రజలకు, ఆర్టీసీకి ఎలాంటి లాభమూ ఉండదని వివరించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఆర్టీసీ మీద ప్రైవేటు పెత్తనం పెరుగుతుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది.
21 డిమాండ్లు.. 45 రోజుల గడువు
ఆర్టీసీ జేఏసీ మొత్తం 21 డిమాండ్లతో యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసింది. తమ సమస్యలను పరిష్కరించేందుకు 45 రోజుల గడువు ఇస్తున్నామని, ఒకవేళ పరిష్కారం చూపకపోతే వచ్చే నెల 9న లేదా ఆ తర్వాత మొదటి డ్యూటీ నుంచి రాష్ట్రంలోని అన్ని డిపోలలోని కార్మికులమంతా సమ్మెబాట పడతామని నోటీసుల్లో హెచ్చరించారు.
తడాఖా చూపిస్తాం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నప్పటికీ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై స్పందించడం లేదని, ఇలానే నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వానికి తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారుకాగా, ఐదేళ్ల తర్వాత మళ్లీ సమ్మె చేయడం అనేది తొలిసారి అంటూ గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రయివేటుపరం చేస్తున్నట్లు వార్తలు.. కార్మికుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయని వాపోయారు. ఎన్నికల వేళ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు.