Kavitha urges more backward reservations in caste survey in report to BC panel: బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్, కులగణనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలకు న్యాయం జరగాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బుసాని వెంకటేశ్వరరావులను కలిసి కవిత వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతి గత రెండు దశాబ్దాలుగా పోరాడుతోందని, బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసిందని కవిత అన్నారు. రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరగాలని, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కులగణనపై నివేదిక ఇచ్చచేందుకు నెల రోజులు సమయం తీసుకోవడం విడ్డూరంగా ఉందని, దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని కవిత చెప్పారు. డెడికేటెడ్ కమిటీ స్వతంత్రంగా పనిచేయాలని, దీనికి ప్రత్యేక కార్యాలయం, మానవ వనరులు, సామాగ్రి అవసరమన్నారు. అయితే ఈ వనరులు ఇవ్వకుంటే కమిటీ ఎలా పనిచేస్తుందని అన్నారు. కులగణన సర్వే పూర్తికాకుండానే 90శాతం పూర్తయిందని చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు.