Site icon Prime9

Medaram Jatara: తెలంగాణ కుంభమేళాకు వేళాయే..12 నుంచి మినీ మేడారం జాతర

Mini Medaram Jatara Begins From February 12th: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ పున:దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఆసియాలోనే అతిపెద్ద జాతర, తెలంగాణ కుంభమేళాగా మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర జరుగుతుండగా, మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర జరుగుతుంది.

ఈ నెల 12 నుంచి ప్రారంభం..
ఈ నెల 12 నుంచి 15 వరకు నాలుగు రోజులు పాటు మినీ మేడారం జాతర జరగనుండగా, బుధవారం మినీ మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది. జాతర ప్రారంభానికి సరిగ్గా వారం రోజుల ముందు గుడి మెలిగే, మండ మెలిగె పండుగను నిర్వహిస్తుంటారు. ఈ మేరకు ఈ నెల 12 నుంచి మినీ మేడారం జాతర ప్రారంభం కానుండగా, బుధవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు గుడి మెలిగే పండుగకు శ్రీకారం చుట్టారు.

గుడిమెలిగే పండుగకు శ్రీకారం..
మేడారంలోని సమ్మక్క ఆలయంలోని సిద్ధబోయిన వంశస్థులు కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాకవంశీయులు గుడిమెలిగే పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యంత నియమ నిష్టలతో పూజారులు గుడిని శుద్ధి చేశారు. పూజారులు, వారి కుటుంబ సభ్యులు డోలువాయిద్యాలతో అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుట్టగడ్డిని తీసుకువచ్చారు. గడ్డికి పసుపు, కుంకుమలతో పూజలు చేసిన అనంతరం పూజామందిరాన్ని అలంకరించారు. మండమెలిగే, గుడిమెలిగే పండుగతో వనదేవతల మినీ జాతర ప్రారంభమైందని పూజారులు చెబుతున్నారు. మినీ జాతర ముగిసే వరకు ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలతోపాటు రాత్రి వేళల్లో డోలీలతో కొలుపు నిర్వహిస్తారు.

మండమెలిగే పండుగ నిర్వహణ..
కొండరాయిలో గోవిందరాలు, నాగులమ్మ జాతరను పురస్కరించుకుని బుధవారం మండమెలిగే పండుగ నిర్వహించారు. ఏటా కొండాయి, దొడ్ల గ్రామాల్లో జాతర నిర్వహిస్తుండగా, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజుల ఆలయాల్లోని పూజా సామగ్రి ఆడేరాలు, పడిగలు, బూరలు ఇతర సామగ్రిని శుద్ధి చేసి అలంకరించారు. ఆలయ ఆవరణంలో ముగ్గులు, మామిడి తోరణాలు కట్టి అలంకరించారు.

రూ.32కోట్లతో పనులు..
మినీ మేడారం జాతరకు ప్రభుత్వం రూ.32కోట్లతో ఏర్పాట్లు చేస్తోంది. నాలుగు రోజులపాటు జరిగే జాతరకు 20లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పలు శాఖల ఆధ్వర్యంలో రూ.32కోట్లతో పనులు చేపట్టింది.

రూ.1.80 కోట్లతో ఆలయాలు..
రూ.1.80 కోట్లతో మేడారం, కన్నెపల్లిలో సమ్మక్క, సారలమ్మల ఆలయాలను నిర్మించారు. రూ. 1.50కోట్లతో పూజాల, గెస్ట్ హౌజ్, రూ. 2.20కోట్లతో రోడ్ల పనులు చేపట్టారు. మేడారం, కన్నెపల్లి, కాల్వపల్లి, ఊరట్టం గ్రామాల్లో రోడ్ల పనులు మొదలు పెట్టారు. మేడారం గద్దెల దగ్గరకు వచ్చే క్యూలైన్లపై చలువ పందిళ్ల నిర్మాణానికి రూ.3కోట్లు కేటాయించారు. పలు పనుల కోసం ప్రభుత్వం రూ. 32కోట్లు కేటాయించింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar