Site icon Prime9

MandaKrishna Madiga : వెంటనే పరీక్షల ఫలితాల విడుదల ఆపండి.. మందకృష్ణ మాదిగ డిమాండ్

MandaKrishna Madiga

MandaKrishna Madiga : రాష్ట్రంలో నేటి నుంచి వివిధ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేస్తుంది. తాజాగా ఇవాళ గ్రూప్-1 పరీక్షల ప్రొవిజనల్ మార్కుల జాబితాను విడుదల చేసింది. రేపు గ్రూప్-2 పరీక్షల జనరల్ ర్యాంకు కార్డులను విడుదల చేయనున్నది. ఎస్సీ వర్గీకరణ జరిగేంతవరకూ అన్ని ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ హైదరాబాద్‌ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ఇవాళ జరిగిన రిలే నిరాహార దీక్షలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని గతంలో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్‌ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు హయాంలో వర్గీకరణ చట్టం..
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ చట్టం రూపొందించారని తెలిపారు. వర్గీకరణ చట్టంలో గతంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌కు వర్గీకరణ సూత్రం వర్తింపజేసేలా 4వ నిబంధనను పొందుపర్చారని చెప్పారు. వర్గీకరణ చట్టాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించాలని సూచించారు. గతంలో ఇచ్చిన నోటిషికేషన్‌లో వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టడం సాధ్యం కాదని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు చూపెట్టిన నిజాయితీని సీఎం రేవంత్‌ చూపెడితే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌లో వర్గీకరణ అమలు జరుగుతుందన్నారు. వర్గీకరణ వ్యతిరేక తీర్పును వేగంగా అమలు చేశారని, అమలు తీర్పును అమలు చేయడానికి కొర్రీలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్సే అధికారంలో ఉందని గుర్తుచేశారు.

చట్టం రాకముందే ఫలితాలా..?
ఒకవైపు వర్గీకరణ చట్టం వస్తుందని చెబుతూనే మరోవైపు చట్టం రాకముందే ఉద్యోగ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం మాదిగలకు ద్రోహం చేయడమేనని అన్నారు. గ్రూప్‌ 1, 2, 3, హాస్టల్ వార్డెన్, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్ తదితర ఉద్యోగ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ సర్కారు మాదిగలకు చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయని, తర్వాత శాంతియుతంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామన్నారు. తహసీల్దార్‌, కలెక్టర్‌ కార్యాలయాల ముట్టడి చేపడతామని స్పష్టం చేశారు.

Exit mobile version
Skip to toolbar