Gaddar: తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ప్రజాగాయకుడు గద్దర్ పేరు తెలియని వారుండరు. తన పాటల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ ఉండే గద్దర్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గద్దర్ ప్రజా పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని కలిశారు. అంతకు ముందు ఏపీ, తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. దోపిడోళ్ల పార్టీ పోయేందుకు ప్రజా పార్టీతో ముందుకొస్తున్నానని ఆయన స్పష్టంచేశారు.
దొరల రాజ్యం వద్దని తెలంగాణ ఉద్యమం వచ్చిందని.. తెలంగాణ సాధించి పదేళ్ల ఉత్సవాలు జరుగుతున్నాయి.. కానీ వేల మంది అమరుల త్యాగం కారణంగా తెలంగాణ వచ్చిందని గుర్తించాలని గద్దర్ పేర్కొన్నారు.
ప్రజలే నా బలం.. బలగం(Gaddar)
తెలంగాణలో ప్రజా పాలన సాగడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కనీసం జీవించే హక్కు కూడా ప్రజలకు లేకుండా పోయిందంటూ గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. దొరల పాలన పోయి ప్రజాపాలన కోసం ప్రజాపార్టీని స్థాపిస్తున్నామన్నానని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం పాలన సాగాలని.. జీవించే హక్కు సహా ఐదు అంశాలు ఆధారంగా పార్టీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజా తెలంగాణ కోసం ప్రజల దగ్గరికి వెళుతున్నాను.. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్తాను.. పార్టీ నిర్మాణం చేస్తాను.. పార్టీ జెండా, ఎజెండా అంతా ప్రజల జెండా ఎజెండానే.. అంటూ గద్దర్ స్పష్టం చేశారు. ప్రలోభాల నుంచి ఓటుని రక్షించడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని గద్దర్ పేర్కొన్నారు. తాను, తన పార్టీ ఎవరితో కలిసి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అనేది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. బంగారు తెలంగాణ పుచ్చిపోయిన తెలంగాణా లా తయారైందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక విధానాలు తప్పులు తడకగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వెనుక కోట్ల మంది ప్రజలు ఉన్నారు.. వాళ్లే నా బలం, నా శక్తి.. అంటూ పేర్కొన్నారు.