Lagacharla incident: లగచర్ల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలపై బీఆర్ఎస్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ నాయకత్వంలోని పార్టీ బృందం అక్కడి రైతులను కలిసి, ప్రభుత్వం అన్యాయంగా గిరిజన రైతుల భూమిని లాక్కునే ప్రయత్నం చేసిందని ఫిర్యాదు చేసింది. మరోవైపు లగచర్ల బయలు దేరిన బీజేపీ అగ్రనేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ప్రభుత్వం రంగంలోకి దిగి పరిగి డీఎస్పీపై వేటు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగటంతో ఇది నానాటికీ ముదిరి రాజకీయ వాద ప్రతివాదాలకు దారితీస్తోంది.
సీఎం తమ్ముడే కీలకం..
రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అన్యాయంగా రైతుల భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా, ఈ క్రమంలో స్థానిక యువత అధికారులను అడ్డుకున్నారని, ఆ సమయంలో కొంత మాటా మాటా పెరిగి కొంత ఘర్షణ జరిగిందని చెప్పారు. దీన్ని ఓ సాకుగా చూపుతూ గ్రామస్తులపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని సత్యవతి వాపోయారు. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ప్రధాన సూత్రధారిగా ఉన్నారని, నేటికీ బాధితులకు ఆయన నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాష్ట్రపతిని కలుస్తాం..
లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో అరెస్టయిన బాధిత రైతుల కుటుంబాల సభ్యులపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలపై ఆదివాసీ బిడ్డ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే ప్రయత్నం చేస్తున్నామని సత్యవతి రాథోడ్ అన్నారు.
న్యాయం చేయండి..
కాగా, తమ భూమి విషయంపై తొమ్మిది నెలల నుంచి ధర్నాలు చేస్తున్నామని లగచర్ల ఫార్మా బాధితులు ఎన్‌హెచ్‌ఆర్సీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకాఎకిన 500 మంది పోలీసులు వచ్చి తమను కొట్టారని, ఇదేమని నిలదీస్తే కేసులు పెట్టి, జైలుకు పట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ తాము భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తమ వారిని వెంటనే విడిచిపెట్టాలని కోరారు. కోరి గెలిపించిన రేవంత్ రెడ్డి ఇలా చేస్తాడని తాము కలలోనూ ఊహించలేదని లగచర్ల ఫార్మా బాధితులు వాపోయారు.
కీలక నేతల అరెస్ట్
మరోవైపు సోమవారం లగచర్ల బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరితో పాటు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని సైతం మొయినాబాద్ వద్ద అడ్డుకొని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
పరిగి డీఎస్పీపై వేటు
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డిపై వేటు వేసింది. ఆయన్ను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాస్‌ను నియమించింది. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సర్కారు ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరెస్ట్ చేసింది. వీరిలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా చర్లపల్లి జైలులో ఉన్నారు.