Site icon Prime9

Meenakshi Natarajan : ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు మీనాక్షి వార్నింగ్

Meenakshi Natarajan

Meenakshi Natarajan

Meenakshi Natarajan : కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత గొడవలపై ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. ఎవరైనా పార్టీపై బహిరంగంగా మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. నియోజవర్గాల్లో ఇన్‌చార్జిల వల్ల సమస్యలు ఏర్పడితే వారిని తొలగించేందుకు వెనుకడుగు వేయబోనని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్‌సభ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ స్థితిగతులు, ఫలితాలపై ఆమె సమీక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు.

నేతలకు దిశానిర్దేశం..
కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై నేతల నుంచి ఆమె అభిప్రాయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటుపై చర్చించారు. త్వరలో రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారు. పార్టీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని హితువు పలికారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఎమ్మెల్యేలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. .

పటాన్‌చెరు ఎపిసోడ్‌పై సీరియస్..
పటాన్‌చెరు కాంగ్రెస్ పంచాయితీ ఎపిసోడ్ మీనాక్షి వద్దకు చేరింది. గాంధీభవన్‌లో జరిగిన సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అంశాన్ని కాటా శ్రీనివాస్‌గౌడ్ ప్రస్తావించారు. పీసీసీ చీఫ్, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి తదితర ముఖ్యనేతలు హాజరైన సమావేశంలో పటాన్‌చెరు పంచాయితీపై నటరాజన్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నాయకులను కాపాడుకోవాలని నేతలకు చురకలు అంటించారు. కాటాతో మీనాక్షి మాట్లాడారు. పార్టీ అన్నీ గమనిస్తోందని చెప్పారు. కార్యకర్తలకు అన్యాయం చేయమని భరోసా ఇచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహతో మీనాక్షి సమావేశమయ్యారు. పటాన్‌చెరులో అసలు ఏమి జరుగుతోందని అడిగి తెలుసుకున్నారు.

గూడెం వర్సెస్ కాటా..
పటాన్‌చెరు కాంగ్రెస్‌లో కొంతకాలంగా ఎమ్మెల్యే గూడెం వర్సెస్ కాటా మధ్య రాజకీయం భగ్గుమంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాటా శ్రీనివాస్‌గౌడ్ పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన గూడెం మహిపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత గూడెం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పార్టీలోకి వచ్చిన తర్వాత నిజమైన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాటా వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే పలు సందర్భాల్లో శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర నేతల దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే గూడెం తీరును నిరసిస్తూ ఇటీవల కాటా వర్గీయులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన విషయం తీవ్ర దుమారం రేపింది. పార్టీ అధికారంలో లేని సమయంలో అండగా నిలిచామని, ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి వచ్చి నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో మీనాక్షి ప్రత్యేక ద‌ృష్టి పెట్టడం పటాన్‌చెరు రాజకీయంలో హాట్ టాపిక్‌గా మారింది. అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీచేసింది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలా ఉండబోతున్నదనేది ఉత్కంఠగా మారింది.

Exit mobile version
Skip to toolbar