Site icon Prime9

KTR Questions: మా మూడు ప్రధాన హామీల సంగతేంటి ? ప్రధాని మోదీకి కేటీఆర్ ప్రశ్నలు

KTR Questions

KTR Questions

KTR Questions: మూడు రోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్న ప్రధాని మోదీకి తెలంగాణ మంత్రి కెటిఆర్ వరుస ప్రశ్నలు సంధించారు. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి సార్ అని కెటిఆర్ ప్రశ్నించారు. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం, పోసేదెప్పుడు.. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు.? మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడని నిలదీశారు.

మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నారు.. మరి.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది.?..పదేళ్లనుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర ? అని కెటిఆర్ అడిగారు. మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. ? గుండెల్లో గుజరాత్‌ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా ?.. అంటూ ఘాటు విమర్శలు చేశారు.కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారు.. లక్షల ఉద్యోగాలిచ్చే ఐ.టీ.ఐ.ఆర్‌ను ఆగం చేశారు.. మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారు.. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారు.మీ పదేళ్ల పాలనలో.. 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారంటూ మండిపడ్డారు.

మళ్లీ వంద స్థానాల్లో మీ డిపాజిట్లు గల్లంతు..(KTR Questions)

2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అన్నారు.. దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు అన్నారు.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అన్నారు. పెట్రోల్ ధరలు నియంత్రిస్తాం అన్నారని కెటిఆర్ గుర్తు చేశారు. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా..? అని కెటిఆర్ అడిగారు. మీ పసుపు బోర్డు ప్రకటన కూడా మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉందని ఎద్దేవా చేశారు.ఎన్నికల వేళ హంగామా ఇప్పుడు.. మరి అది అమలు అయ్యేది ఎప్పుడో అని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో. అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటో చెప్పాలని కెటిఆర్ అన్నారు. మా మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా…! మళ్లీ వంద స్థానాల్లో మీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ…!! అని కెటిఆర్ హెచ్చరించారు

Exit mobile version
Skip to toolbar