Garimella Balakrishna : టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) కన్నుమూశారు. తిరుపతిలోని తన నివాసంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేసిన ఆయన ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ప్రఖ్యాతిగాంచారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనవుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు లాంటి కీర్తనలకు స్వరాలు సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ గరిమెళ్ల ప్రసిద్ధులు. శుక్రవార యాదగిరిగుట్టలో గరిమెళ్ల తన ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. ఇంతలోనే ఆయన మరణవార్త తెలిసి సంగీత ప్రియులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
సంగీత ప్రపంచానికి తీరని లోటు : మంత్రి నారా లోకేశ్
గరిమెళ్ల మృతి పట్ల మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గరిమెళ్ల బాలకృష్ణ మృతి చెందారన్న వార్త బాధ కలిగించిందని తెలిపారు. 1978 నుంచి 2006 వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన ఆయన వందలాది అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారని పేర్కొన్నారు. సంప్రదాయ కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతంలో తనదైన ముద్ర వేసిన గరిమెళ్ల మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. ఆయన సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గరిమెళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తన ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
గరిమెళ్ల మృతిపై తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం సంప్రదాయ సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. తితిదే ఆస్థాన విద్వాంసుడిగా ఆయన విశేష సేవలందించారని గుర్తు చేసుకున్నారు.