Site icon Prime9

AP, Telangana Temperatures : తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు.. అల్లాడుతున్న జనం

Temperatures

Temperatures

AP, Telangana Temperatures : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. 10 రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. దీంతో గొడుగులు పట్టుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంతోపాటు పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇలా ఉందంటే మేలో ఎలా ఉంటాయోనని భయపడుతున్నారు.

 

మరోవైపు హైదరాబాద్‌లో రానున్న రెండు రోజులపాటు 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్ నాలుగు జిల్లాల్లో వడగాలులు అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3.3 సెల్సియస్ డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

నంద్యాల జిల్లాలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..
శనివారం నంద్యాల జిల్లాలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. కర్నూలు జిల్లాలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలున మోదు కాగా, ప్రకాశం జిల్లాలో 41.7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

 

ఏపీ తీవ్ర వడగాలులు..
ఏపీలోని పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని 11 మండలాలు, విజయనగరం జిల్లా పరిధిలోని 16 మండలాలతో పాటు పార్వతీపురం మన్యం-13, అల్లూరి సీతారామరాజు-3, కాకినాడ-1, తూర్పుగోదావరి-1 మండలాల్లో తీవ్రవడగాల్పుల (45) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఏపీలోని 185 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

 

 

Exit mobile version
Skip to toolbar