Prime9

Andhra Cricket Association : విశాఖ వేదికగా ప్రపంచ కప్ మహిళా క్రికెట్ టోర్నీ మ్యాచ్‌లు

Andhra Cricket Association President and Vijayawada MP Kesineni Chinni : రాజధాని అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణంపై కూటమి ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. అమరావతిలో అత్యుత్తమ వసతులతో స్టేడియం నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని తెలిపారు. త్వరలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ (ఏసీఏ)కు స్థలం రాగానే నిర్మాణం చేపడుతామన్నారు. ఆదివారం విజయవాడలోని ఓ హోటల్‌లో ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీ కేశినేని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతిలో స్టేడియం కోసం 65 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

 

45 రోజుల్లోనే విశాఖలో 2 ఐపీఎల్ మ్యాచ్‌లు..
లక్ష మంది కూర్చునేలా అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మిస్తామని చెప్పారు. ఏపీలో క్రీడాభివృద్ధి కోసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున కష్టపడుతున్నామని స్పష్టం చేశారు. 45 రోజుల్లోనే విశాఖలో 2 ఐపీఎల్ మ్యాచ్‌లు విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. మహిళా ప్రపంచ కప్ సందర్భంగా విశాఖపట్నంలో 5 మ్యాచ్‌లు నిర్వహణకు అనుమతి వచ్చిందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో 25 జిల్లాల్లో క్రికెట్ మైదానాలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు, నెల్లూరులో స్థలం ఉన్నందున క్రికెట్ మైదానాలు నిర్మించేలా చర్యలు చేపడతామన్నారు. అన్ని జిల్లాల్లో మ్యాచ్‌లు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు.

 

ప్రతి జిల్లాలో క్రికెట్ మైదానాలు నిర్మించేలా ముందుకెళ్తామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీశ్ తెలిపారు. 60 రోజుల్లో విశాఖ స్టేడియం రూపురేఖలు మార్చామన్నారు. విశాఖలో ప్రపంచ కప్ మహిళా క్రికెట్ టోర్నీ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి వచ్చిందని వివరించారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 5 ప్రపంచ కప్ మహిళా క్రికెట్ మ్యాచ్‌లు జరుపుతామన్నారు. ప్రతి జిల్లాకు ఇచ్చే నిధులు రూ.20 నుంచి రూ.40 లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar