Kurnool High Court : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాయలసీమ వాసుల కలను నెరవేర్చేందుకు 2014-19లో టీడీపీ అడుగులు వేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం స్థానిక ప్రాంతాలను పరిశీలించింది. కానీ, ఎన్నికలు రావడంతో టీడీపీ ఓటమి చవిచూసింది. వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. కర్నూలును మూడో రాజధాని చేస్తామని ప్రకటించింది. హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని హామీని కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఏపీలో ఎన్నికలు రావడంతో వైసీపీ ఓడిపోయింది. కర్నూలు మూడో రాజధాని, హైకోర్టు అంశం మరుగున పడిపోయింది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కసరత్తులు చేస్తోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
అసెంబ్లీలో మంత్రి ప్రకటన..
తాజాగా మంత్రి ఫరూక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యే నాగేశ్వరరెడ్డి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. స్థానికంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తోందని చెప్పారు. రాయలసీమ వాసుల కోసం కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు స్థలానికి సంబంధించి సలహాలు, సూచనలు ఇస్తే ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని మంత్రి స్పష్టం చేశారు.