Site icon Prime9

Sea Plane in AP: విజయవాడ – శ్రీశైలం సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం

Chandra Babu Launch Sea Plane Services: మారుమూల ప్రాంతాలకు రవాణా సాధానాలను మెరుగు పరచడంతో పాటు రాష్ట్రంలో పర్యాటక ప్రగతికి తగిన చర్యలు చేపడతామని సీఎం నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సీప్లేన్‌ సర్వీసులతో ఆ లోటును భర్తీ కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్‌, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ లతో కలిసి విజయవాడ -శ్రీశైలం సీప్లేన్‌ డెమో సర్వీసులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీ ప్లేన్‌ లో పున్నమి ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన జెట్టీ నుంచి టేకాఫ్‌ అయి, శ్రీశైలం పాతళగంగ బోటింగ్‌ పాయింట్‌ వద్ద నిర్మించిన ల్యాండింగ్‌ పాయింట్‌‌కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర దేవదాయ శాఖామంత్రి ఆనం రామనారాయాణ రెడ్డితో కలిసి ప్రముఖ శైవక్షేత్రం మల్లికార్జున స్వామివారికి, భ్రమరాంబ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇప్పటి వరకు విజయవాడ నుంచి శ్రీశైలానికి చేరుకోవాలంటే ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చేదని తెలిపారు. సీప్లేన్‌ సర్వీసు రాకతో ఒకే రోజులో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లి రావచ్చని వెళ్లడించారు.

వినూత్న అవకాశం.. వినియోగించుకోవాలి
రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతాన్ని అనుసంధానం చేయాలనే వినూత్న ఆలోచనతో సీ ప్లేన్‌ లను ప్రవేశ పెట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది వినూత్న అవకాశమని, అంతా వినియోగించు కోవడంతో పాటు రాష్ట్రంలో పర్యాటక ఆదాయాన్ని పెంచేందుకు తోడ్పడాలని సూచించారు. టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, యువత దానిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అత్యంత పిన్న వయస్సులోనే కేంద్ర కేబినెట్‌ మంత్రిగా, తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్‌ నాయుడు కొనియాడారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ… ప్రతి చిన్న పట్టణాన్ని వాయు మార్గంతో అనుసంధానం చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్‌ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దీనిని మరింత ముందుకు తీసుకు వెళ్లాలనే ఆలోచనతో ఉడాన్‌ 2.0 కార్యచరణకు రూపకల్పన చేశామన్నారు. ప్రతి మారుమూల ప్రాంతానికీ కొత్త సర్వీసులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. భవిష్యత్తులో విశాఖపట్నం – శ్రీకాకుళం, రాజమండ్రి, గోదావరి పరీవాహక ప్రాంతం, నాగార్జున సాగర్‌, దక్షిణ కోస్తా జిల్లాల్లో సీప్లేన్‌ లను విస్తరించే ఆలోచనలో ఉన్నామని వివరించారు.

Exit mobile version