Bhogapuram Airport: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే భోగాపురం ఎయిర్ పోర్టు పనులను లక్ష్యం కంటే ముందుగానే 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెళ్లడించారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆదివారం 6వ సారి ఆయన భోగాపురం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు చేపడుతున్న జీఎంఆర్ ఇన్ ఫ్రా అధికారులతో పరిశీలించారు. ప్రధాన టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్, ఏప్రాన్, డ్రైనేజీ వ్యవస్థ, ఏరో బ్రిడ్జులు, కార్యాలయ భవనాలను తనిఖీ చేశారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మరింత వేగవంతం చేయాలి..
గత 4 నెలల్లో పనుల్లో కీలక పురోగతి సాధించామని, 49.1 శాతం పనులు పూర్తయ్యాయని ఈ సందర్భంగా జీఎంఆర్ అధికారులు మంత్రికి వివరించారు. విభాగాల వారీగా పనుల వివరాలను తెలియజేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… వీలయినంత వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా అధికారులు కూడా ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. భోగాపురం పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రకు తలమానికంగా నిలవడంతో పాటు.. రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా తీర్చిదిద్ద వచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి కేంద్రంతో పాటు సీఎం నారా చంద్రబాబునాయుడు సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. పరిశీలనలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.