Gannavaram: టీడీపీ నేతపై దాడి.. పోలీసుల అదుపులో వల్లభనేని అనుచరులు

Vallabhaneni Vamshi Followers arrested: టీడీపీ కార్యాలయంతో పాటు ఆ పార్టీ నేత కాసనేని రంగబాబుపై దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన ప్రధాన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశారు.

కృష్ణా జిల్లాలోని గన్నవరంలో ఉన్న టీడీపీ కార్యాలయంపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు ముగ్గురు ఓలుపల్లి మోహనరంగాతోపాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అంతకుముందు గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై మాజీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడంతోపాటు ఓ కారుకు నిప్పంటించి దహనం చేశారు.

అదే విధంగా గతంలో వైసీపీలో ఉన్న రంగబాబు ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న వంశీ అనుచరులు ఆయనపై దాడికి దిగారు. గన్నవరంలోని పార్క్ ఎలైట్ హోటల్ దగ్గర రంగబాబుపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులకు వెంటనే నిందితులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఓ పొలం విషయంపై మాట్లాడాలని రంగబాబును పిలిచి.. పక్కా ప్లానింగ్ ప్రకారమే దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అంతకుముందు ఈ కేసును వైసీపీ ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు ఈ కేసు విచారణలో ఓ కొలిక్కి వచ్చింది. దర్యాప్తు అనంతరం టీడీపీ నేతపై దాడి కేసులో నిందితులు మోహనరంగాతోపాఠు అనగాని రవి, బాబు, భీమవరపు రాము, సూరపనేని అనిల్, గుర్రం నాని, పొన్నూరు సీమయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరందరినీ కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.