Site icon Prime9

Parawada Pharma City: ఫార్మాసిటీలో విష వాయువులు లీక్‌తో ఒకరు మృతి.. 15మందికి అస్వస్థత.. చంద్రబాబు ఆరా!

AP CM Chandrababu on the Paravada Pharmacity incident: అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి విషవాయువు లీకై కార్మికుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఠాగూర్‌ ల్యాబొరేటరీస్‌ కంపెనీలో మంగళవారం విషవాయువు లీకై 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒడిశాకు చెందిన కార్మికుడు అమిత్‌ (22) మృతి చెండాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా..
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ లేబరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకైన ఘటనలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వారిని క్రిటికల్ కేర్‌ సెంటర్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సాయం అందించాలని అధికారులుకు నిర్దేశించారు. బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు.

హోంమంత్రి అనిత సీరియస్..
విశాఖ ఘటనపై ఏపీ హోం మంత్రి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ ఎం.దీపికతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలిచ్చినా కంపెనీల నిర్లక్ష్య వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కిమ్స్ ఆస్పత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాద స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్ సేకరిస్తున్నాం : కలెక్టర్‌
ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ తెలిపారు. రియాక్టర్‌ కమ్‌ రిసీవర్‌ ట్యాంక్‌ నుంచి లిక్విడ్‌ హెచ్‌సీఎల్‌ లీకైందని వెల్లడించారు. తొమ్మిది మంది కార్మికులకు శ్వాస, దగ్గు సమస్యలు వచ్చాయని తెలిపారు. అస్వస్థతకు గురైన వారిని గాజువాకలోని పవన్‌సాయి ఆసుపత్రికి, ముగ్గురిని విశాఖ షీలానగర్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాలని ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ను ఆదేశించామని తెలిపారు. ప్రమాద స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్ సేకరిస్తున్నామన్నారు.

Exit mobile version