AP Cabinet Meeting Today: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ బుధవారం రాజధాని అమరావతిలో సమావేశం కానున్నది. సాయంత్రం 4.00 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో భేటీ జరగనున్నది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అమలు చేయాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
రాజధాని పనులపై ఫోకస్
రాజధాని అమరావతికి సంబంధించి గతంలో గుత్తేదారులకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ సమావేశంలో మంత్రులతో చర్చించి, వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలు, ఒప్పందాలు, వాటి పురోగతిపై మంగళవారం ఎస్ఐపీబీ సమావేశంలో ఇప్పటికే చర్చించిన నేపథ్యంలో ఆ ఒప్పందాలు, వాటి స్థితిగతులపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.
ఉచిత ప్రయాణంపై ప్రకటన?
వచ్చే సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ వస్తే సర్కారు మరో హామీ నెరవేర్చినట్టు అవుతుంది. అయితే ఉచిత బస్సు పథకం అమలు కోసం ఏపీఎస్‌ఆర్‌టీసీ అధికారులు పూర్తి ప్రణాళికను సిద్ధం చేసినట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ఈ పథకం అమలులో ఉన్న తెలంగాణ, కర్ణాటకల్లో అధికారుల బృందాలు పర్యటించాయి. రెండు ప్రభుత్వాలు అనుసరించిన విధానాలను వారు అధ్యయనం చేశారు.
అయితే ప్రస్తుతానికి ఆర్టీసీ టిక్కెట్ల ద్వారా నెలకు సగటున 500 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతోంది. ఇందులో డీజిల్‌పై 220 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఆర్టీసీ నెలకు సగటు ఆదాయంలో రూ.125 కోట్లు (25 శాతం) ప్రభుత్వానికి చెల్లిస్తోంది. ఇప్పుడు, ప్రభుత్వం ఈ మొత్తాన్ని వదులుకోవాలి. ఉచిత ప్రయాణ పథకం కోసం ఆర్టీసీకి మరో రూ.250 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.