AP Cabinet Meeting Key Decisions: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ , మంత్రులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్‌ను మరింత పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కూడా ఓకే చెప్పారు. అదేవిధంగా లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
కీలక నిర్ణయాలివే..
కర్నూలులో కేంద్రంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఈగల్ యాంటీ నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అమరావతి సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు, స్పోర్ట్స్, పర్యాటక పాలసీలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ టవర్ కార్పొరేషన్‌ను ఫైబర్ గ్రిడ్‌లో విలీనం చేయాలని నిర్ణయించారు. కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్స్‌లను పునరుద్ధరించనున్నారు. దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఎక్సైజ్ చట్టసవరణ ముసాయిదా, ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపు, పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ పరిధి పెంపు, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి ఆమోదం తెలిపింది. జ్యుడీషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచుతూ ఆమోదం లభించింది. 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
కేబినెట్‌లో పవన్ సూచనలు..
రాష్ట్రంలోని సంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహం కల్పించటంతో బాటు గ్రామీణ క్రీడాకారులకు తగిన మద్దతు అందించే పాలసీలు రూపొందించాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. అదే సమయంలో కల్చరల్, హెరిటేజ్, టెక్స్‌టైల్ టూరిజంతో పాటు సేఫ్టీ పాలసీపైన కూడా పవన్ పలు కీలక సూచనలు చేశారు. అలాగే, వైసీపీ హయాంలో పోలీసులు క్రమశిక్షణ తప్పారని పవన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే విధంగా వైసీపీ నేతల సోషల్ మీడియా వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాల్సినందేనని డిప్యూటీ సీఎం గట్టిగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఆ చట్టం రద్దు..
ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూనే ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ 2024 బిల్లుకు తాజాగా ఆమోదం తెలిపింది. పాత చట్టంతో భూ ఆక్రమణలపై కేసుల నమోదులో ఇబ్బందులు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం అందుతున్న 80శాతం ఫిర్యాదుల్లో భూవివాదాలే ఉన్నాయని, వైసీపీ హయాంలో లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు చెబుతోంది.